గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): ద్విచక్ర వాహనం మీద వెళ్తున్న ఓ వ్యక్తి దురదృష్టవశాత్తూ ఆర్టీసీ బస్సు కింద పడి తీవ్ర గాయాలకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం దామర్‌చెడ్ గ్రామం వల్య నాయక్ తండాకు చెందిన ముడావత్ లక్ష్మణ్ (35) బతుకు దెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి కూలి పనులు చేసుకుంటూ శేరిలింగంపల్లి మండల పరిధిలోని రాయదుర్గం గ్రామం రాధేనగర్ కాలనీలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. కాగా మంగళవారం మధ్యాహ్నం 2.15 గంటలకు అతను ఓయూ కాలనీ నుంచి రాధేనగర్లో ఉన్న తన ఇంటికి టీవీఎస్ మోటార్ సైకిల్ (టీఎస్34డి9918) పై వెళ్తున్నాడు. మార్గమధ్యలో రాయదుర్గంలోని మెహ్ఫిల్ ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మెహిదీ పట్నం నుంచి లింగంపల్లి వైపుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు (ఏపీ28జడ్1220) కు అతను మోటార్ సైకిల్‌పై కుడి వైపుగా వెళ్లాడు. దీంతో ప్రమాదవశాత్తూ అతను బస్సు కింద పడ్డాడు. ఈ క్రమంలో అతని తలకు తీవ్రమైన గాయాలు అయి అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు అతని భార్య ముడావత్ నీలా బాయి ఇచ్చిన ఫిర్యాదుకు స్పందించిన రాయదుర్గం పోలీసులు లక్ష్మణ్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.