- వన్యప్రాణుల సంరక్షణ కార్యకర్త రోహిత్ బొందుగుల
గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో ఉన్న అటవీ ప్రాంతాన్ని, అందులో ఉన్న వన్యప్రాణులను కాపాడాలని వర్సిటీ పీహెచ్‌డీ స్కాలర్, వన్యప్రాణుల సంరక్షణ కార్యకర్త, ఏబీవీపీ ఎస్ఎఫ్‌డీ స్టేట్ కన్వీనర్ రోహిత్ బొందుగుల అన్నారు. యూనివర్సిటీలో నూతనంగా నిర్మాణమవుతున్న ఎస్ఎన్ స్కూల్ భవంతి వద్ద మంగళవారం వేట కుక్కల దాడిలో చనిపోయిన జింకను రోహిత్ గుర్తించారు.
ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. గత కొంత కాలంగా హెచ్‌సీయూలో అటవీ ప్రాంత విస్తీర్ణం తగ్గుతూ వస్తుందని, దీంతో వన్యప్రాణులకు ఉండేందుకు స్థలం లేకుండా పోతుందని అన్నారు. అందువల్ల అవి బయటకు వస్తున్నాయని, దీంతో వేటగాళ్లు, వేట కుక్కలు వాటిపై దాడి చేస్తూ చంపేస్తున్నాయన్నారు. రాష్ట్ర జంతువుగా ఉన్న జింకతోపాటు జాతీయ పక్షి నెమలి, అడవి పందులు, కుందేళ్లు, ఇతర అరుదైన జాతులకు చెందిన జీవులు యూనివర్సిటీలోని అటవీ ప్రాంతంలో చనిపోయాయన్నారు. అందువల్ల వెంటనే వేట కుక్కలు లేకుండా చూడాలని, మిగిలి ఉన్న అటవీ ప్రాంతాన్ని కాపాడాలని అన్నారు. ఇందుకు గాను యూనివర్సిటీలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది కలసి కట్టుగా పనిచేయాలన్నారు. అలాగే వర్సిటీలో కొత్తగా నిర్మాణాలు చేపడితే అటవీ ప్రాంతం కోల్పోకుండా ముందుగానే లే అవుట్ వేసి దాన్ని కమిటీ ముందు ఉంచాలని, ఇలా చేయడం వల్ల అటవీ ప్రాంతం కోల్పోకుండా కాపాడిన వారమవుతామని అన్నారు.