జ్యువెలరీ షాప్‌లో భారీ చోరీ.. 7 తులాల బంగారం, 4 కిలోల వెండి అపహరణ

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 1 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నూకల శివశంకర్‌కు చెందిన బాలాజీ జ్యువెలరీ షాప్‌లో శనివారం అర్ధరాత్రి దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. షాప్ వెనుక భాగంలోని డోర్ ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను తొలగించి రంధ్రాన్ని పెద్దదిగా చేసి లోపలికి ప్రవేశించిన దుండగులు, వెనుక గది నుంచి ముందు గదికి మధ్యనున్న తలుపుకు మరో రంధ్రం చేసి షాప్‌లోని బంగారం, వెండి ఆభరణాలను అపహరించారు. ఈ ఘటనలో సుమారు 7 తులాల బంగారం, 4 కిలోల వెండి చోరీకి గురైనట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

సమాచారం అందుకున్న వెంటనే డీసీపీ చింతమనేని శ్రీనివాస్, ఏసీపీ సీహెచ్. వై. శ్రీనివాస్ కుమార్, సీసీఎస్, ఎస్‌వోటీ, చందానగర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తుండగా, సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, ఇతర కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here