మియాపూర్ ప్రభుత్వ పాఠశాలకు రూ.22 లక్షలతో కొత్త తరగతి గదులు

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 1 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కార్నర్ స్టోన్ సాఫ్ట్‌వేర్ సంస్థ సీఎస్‌ఆర్ నిధులతో రూ.22 లక్షల వ్యయంతో నిర్మించిన రెండు అదనపు తరగతి గదుల భవనాన్ని పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, సంస్థ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ప్రాథమిక విద్య విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాది వంటిదని అన్నారు. సీఎస్‌ఆర్ నిధులతో నిర్మించిన ఈ అదనపు తరగతి గదులు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయని, ప్రశాంతమైన వాతావరణంలో విద్యాభ్యాసానికి వీలు కల్పిస్తాయని చెప్పారు. సమాజం పట్ల బాధ్యతగా విద్యారంగానికి సహకరించిన కార్నర్ స్టోన్ సంస్థ ప్రతినిధులను అభినందిస్తూ, ఇతర సంస్థలు కూడా సామాజిక బాధ్యతలో భాగంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

విద్యార్థులు క్రమశిక్షణ, ఏకాగ్రత, పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న ఆరెకపూడి గాంధీ, మియాపూర్‌లో 10 ఎకరాల్లో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా పాఠశాలకు ఇటీవల శంకుస్థాపన జరిగిందని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. అలాగే కొండాపూర్, చందానగర్ ప్రాంతాల్లో కోర్ అర్బన్ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని, తనవంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో కార్నర్ స్టోన్ సాఫ్ట్‌వేర్ సంస్థ ప్రతినిధులు కిరణ్, ఉషారాణి, భార్గవి, పవన్, తేజ్‌కుమార్, నిర్మల, హరి చైతన్య, మంజుల, శ్రీకాంత్, శ్రీనివాసరావు, నికిత, జన్య ఫౌండేషన్ ప్రతినిధులు సురేంద్ర, చిరంజీవి, నాయకులు ప్రతాప్ రెడ్డి, ఉదయ్ కిరణ్, రవిచంద్ర రెడ్డి, అరుణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here