నమస్తే శేరిలింగంపల్లి: మణికొండ ల్యాంకో హిల్స్ లో ఈనెల 8న ఓ యువతి (బిందు శ్రీ (28) బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బిందు శ్రీ (28) ది అనుమానాస్పద మృతిగా రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేపట్టారు. దీంతో కొత్త విషయాలు బయట పడుతున్నాయి.
మణికొండ ల్యాంకో హిల్స్ లోని 15 ఎల్ హెచ్ బ్లాక్ లోని పూర్ణ చందర్ రావు ఇంట్లో చిల్డ్రన్ కేర్ టేకర్ గా పనిచేస్తుందని ఆమె ఆత్మహత్యకు పాల్పడిన రోజు పోలీసులు తెలిపారు. అయితే విచారణలో మాత్రం బిందుశ్రీకి సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామంటూ మచ్చిక చేసుకుని పూర్ణ చందర్ రావు కొన్నాళ్లుగా బిందుశ్రీతో సహజీవనం చేస్తున్నారని, అదే సమయంలో బిందు ఎదుటే మరొక యువతితో పూర్ణ చందర్ రావు సన్నిహితంగా తిరుగుతూ తనను పట్టించుకోవడం లేదని, ఎలాంటి సినిమా అవకాశాలు ఇప్పించలేదని, సినిమా అవకాశాల పేరుతో మోసం చేశారని మనస్థాపానికి గురైన బిందు శ్రీ రాయదుర్గంలోని లాంకో హిల్స్ 21 అంతస్థు భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తాజా దర్యాప్తులో వెల్లడయింది. పూర్ణ చందర్ రావు కన్నడ సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తుంది. మృతురాలు బిందు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.