దేశంలో ఆర్థిక సంస్కరణల పితామహుడు మాజీ ప్రధాని పీవీనర్సింహారావు: పి.వి మనోహర రావు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: తెలుగు జాతి ఖ్యాతిని, ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన ఆర్ధిక సంస్కరణల పితామహుడు పీవీ నరసింహారావు చిరస్మరణీయులని సాహితీ వేత్త, పీవీ నరసింహారావు సోదరులు పీవీ మనోహర రావు కొనియాడారు. తెలుగువెలుగు సాహితీ వేదిక, యస్ వీ ఫౌండేషన్, జన దీపిక ల సంయుక్త ఆధ్వ‌ర్యంలో దివంగ‌త‌ భారత ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని శతాధిక కవులచేత కవిసమ్మేళనం నిర్వ‌హించారు. ఈ కవి సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ప్రధాని సోదరులు పీవీ మనోహర్ రావు కవులనుద్దేశించి మాట్లాడుతూ…

పివి.న‌ర‌సింహ‌రావు శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల్లో పాల్గొన్న ఆయ‌న సోద‌రుడు పి.వి.మ‌నోహ‌ర‌రావు, స‌మావేశంలో హాజ‌రైన తెలుగు క‌వులు

తెలుగు సాహిత్య రంగంలో విశేషంగా కృషి చేసిన పీవీ రాజకీయ రంగంలో సైతం అద్భుతంగా రాణించి తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పారని తెలిపారు. భూ సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలను తీసుకువచ్చి దేశ ప్రగతికి బాటలు వేశారని తెలిపారు. 14 భాషలలో నిష్ణాతుడని, సహస్రఫణ్ పేరుతో వేయిపడగలు హిందీ అనువాదం చేసి సాహిత్య పురస్కారం పొందారని తెలిపారు. పీవీకి నివాళిగా, తెలుగు వెలుగు సాహితీ వేదిక చేస్తున్న కార్యక్రమానికి విచ్చేసిన పీవీ మనోహర్ రావు కు కృతజ్ఞతలు తెలిపారు. అనంత‌రం గోల్కొండ సాహితీవేత్త సలహాదారులు ప్రముఖ కవి రచయిత గంట మనోహర్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ప్రధాని పీవీ దక్షిణ భారతదేశానికి ఒక ఠీవి అని ఆయ‌న‌ రాజకీయ, ఆర్దిక, ఆధ్యాత్మిక ,సాహిత్య దురంధరులని కొనియాడారు. ప్రముఖ కవి రచయిత ,విమర్శకులు విశ్లేషకులు కీలపర్తి దాలినాయుడు మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకు వచ్చిన రాజనీతి దురంధరుడు, గొప్ప సాహితీవేత్త పీవీ ప్రాతఃస్మరణీయులని తెలిపారు. ప్రముఖ సాహితీవేత్త కవి రచయిత లంక వెంకటస్వామి మాట్లాడుతూ భరత జాతి ముద్దు బిడ్డ తెలుగువారి ఆత్మగౌరవ పతాక పీవీ అని అన్నారు. అక్షర కౌముది సంస్థ అధ్యక్షులు తులసి వెంకటరమణాచార్యులు మాట్లాడుతూ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసి న్యాయవృత్తికి వన్నె తెచ్చారని తెలిపారు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పీవీ , తెలంగాణ పోరాట యోధుడు అంధకార రాజకీయానికి వెలుగు నింపారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా విచ్చేసిన ఆచార్య సోమయాజులు, రాచమల్లు మల్లిఖార్జున పీవీ గురించి, వారి గొప్ప తనాన్ని వివరించారు. ఈ కార్యక్రమానికి తొలిపలుకులు పలికిన తెలుగువెలుగు సాహిత్య వేదిక అధ్యక్షులు పి ఆర్ ఎస్ ఎస్ ఎన్ మూర్తి మాట్లాడుతూ ఇంత గొప్ప కార్యక్రమానికి పీవీ నర్సింహారావు సోదరులు పీవీ మనోహర్ రావు రావడం తెలుగు వెలుగు సాహితీ వేదిక కు నూతనోత్సాహం వచ్చిందని అంతటి మహానుభావులు ఈ వేడుకలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. సభాధ్యక్షులుగా యస్ వీ ఫౌండేషన్ ఛైర్మన్, కవి, రచయిత, వ్యాఖ్యాత మోటూరి నారాయణ రావు వ్యవహరించిన ఈ సమావేశానికి సమన్వయకర్తలుగా నవనీత రవీందర్, బీ మల్లేశ్వరమ్మ వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి కవులూ కవయిత్రులూ 320 మంది కవులు పీవీ నర్సింహారావు పేరిట వ్రాసిన క‌విత‌ల‌ను త్వరలో శతాధిక కవులు శతజయంతి కవితా సంకలనం పుస్తకాలను ముద్రించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here