నమస్తే శేరిలింగంపల్లి: రోజురోజుకూ విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో పెరగుతున్న జనసాంద్రతకు అనుగుణంగా రహదారుల నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు రాష్ట ఐటి, పట్టణాభివృద్ది శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. సోమవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో దాదాపు 25 కోట్ల రూపాయలతో నిర్మించిన లింకురోడ్లను ఆయన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌గాంధీ, జిహెచ్ఎంసి కమీషనర్ లోకేష్ కుమార్‌తో పాటు స్థానిక కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి కృషి చేస్తున్నామని, మౌళిక వసతుల కల్పనలో వేగవంతంగా పనిచేస్తున్నామన్నారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కింద ఆరు వేల కోట్ల రూపాయలతో నగరంలో రోడ్లు, బ్రిడ్జ్‌లు, అండర్ పాస్‌లు నిర్మిస్తున్న విషయం తెలిసిందేనని, రోడ్ల నిర్వహణ కోసం 1800 కోట్ల రూపాయలతో కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ చేపడుతున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్ఆర్‌డిసిఎల్) ఆధ్వర్యంలో మిస్సింగ్ లింకురోడ్ల నిర్మాణంలో మొదటి దశలో భాగంగా 313.65 కోట్ల రూపాలయతో 24.3 కిమీ. రహదారి నిర్మాణాన్ని చేపట్టామని, అందులో దాదాపుగా 16 రోడ్లు పూర్తవ్వగా మరో ఆరు రహదారులు నెల రోజుల్లో పూర్తవుతాయని తెలిపారు. రెండవ దశలో 65.94 కోట్ల నాలుగు రోడ్లల నిర్మాణం జరుగనుందని, దీంతోపాటు 232 కోట్లతో మరో 13 రోడ్ల పనులు నిర్వహించేందుకు ప్రణాలికలు సిద్దం చేశామని తెలిపారు. ఈ అభివృద్ది పనులన్నీ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రధాన రహదారులపై రద్దీని, కాలుష్యాన్ని తగ్గించడమే ఈ ప్రాజెక్టుల ముఖ్య ఉద్దేశమని తాము అవలంబిస్తున్న విధానాలపై సలహాలను ఇతర రాష్ట్రాల అధికారులు అడిగి తెలుసుకుంటున్నారన్నారు. తాము లక్ష్యంగా నిర్ణయించుకున్న 133 లింకురోడ్ల అభివృద్దిని దశల వారీగా పూర్తి చేస్తామని తెలిపారు. లాక్‌డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుని త్వరగా అందుబాటులోకి తీసుకువచ్చిన జిహెచ్ఎంసి, హెచ్ఆర్‌డిసిఎల్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్‌డిసిఎల్ సిఈ జియాఉద్దీన్ , ఎస్ఈ రహమాన్ , ఈఈ సర్ధార్ సింగ్, వెస్ట్‌జోన్ కమీషనర్ రవికిరణ్ కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్‌గౌడ్, జగదీశ్వర్‌గౌడ్, రాగం నాగేందర్‌యాదవ్, హమీద్‌పటేల్, మంజుల రఘునాథ్‌రెడ్డి, రోజా రంగారావు, వెంకటేష్‌గౌడ్, నార్నె శ్రీనివాస్, జూలపల్లి సత్యనారాయణ, నాయకులు కొమ్మిరిశెట్టి సాయిబాబ తదితరులు పాల్గొన్నారు. జిహెచ్ఎంసి ఎస్ఈ చిన్నారెడ్డి, ఈఈ శ్రీకాంతిని, డీఈ రూపదేవి, ఏఈ ప్రశాంత్ , జలమండలి జిఎం రాజశేఖర్, డిజిఎం నారాయణ తదితరులు పాల్గొన్నారు.