వెంటిలేటర్ పై చికిత్స అంటే ఆషామాషీ కాదు.

వెంటిలేటర్ అంటే ఏమిటో తెలుసా..?

తరచుగా ఆసుపత్రికి వెళ్లేవారు “రోగిని వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు” వంటి మాటలు వింటూనే ఉంటారు. కరోనా వ్యాధి ప్రబలిన తర్వాత వెంటిలేటర్ అనే పదం సర్వసాధారణమైపోయింది. కరోనాలో శ్వాస సంబంధిత సమస్యలు తీవ్రతరమైనప్పుడు వెంటిలేటర్ పై చికిత్స తప్పనిసరి అవుతోంది. అయితే దానిపై చికిత్స పొంది బ్రతికి బయటపడ్డ వారికి తప్ప చికిత్స సమయంలో అనుభవాలు తెలియవు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై ప్రాణాపాయంలో ఉన్నవారిని, దీర్ఘకాలిక వ్యాధులతో చావుబ్రతులుల్లో ఉన్నవారిని వెంటిలేటర్ పై ఉంచి బ్రతికించేందుకు వైద్యులు ప్రయత్నాలు చేస్తుంటారు. మరి వెంటిలేటర్ పై చికిత్స ఎలా ఉంటుంది, ఆ సమయంలో రోగి ఎలాంటి బాధలు అనుభవిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం…!

వెంటిలేటర్ ఆంటే…

వెంటిలేటర్ అంటే నోటిపై ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని సరదాగా బెడ్ మీద పడుకుని పత్రికలు చదువుతూనో, ఫోన్ చూస్తూనో కాలక్షేపం చేయడం అని చాలామంది భావిస్తుంటారు. కానీ చికిత్స ఎంతో బాధాకరమైన ఇంట్యూబేషన్తో ఇది మొదలవుతుంది. నోటి నుండి గానీ శ్వాసనాళం నుండి కడుపులోకి గొట్టాన్ని చొప్పించి, ద్రవాహారం శరీరం లోకి పంపిస్తారు. రోగి తనకు తానుగా శ్వాస తీసుకోవడానికి కష్టంగా ఉంది కాబట్టి కృత్రిమంగా ఆక్సిజన్ అందించే ఏర్పాటు వెంటిలేటర్ లో ఉంటుంది. రోగి శరీర ఉష్ణోగ్రతకు సరిపోయేలాగా ఈ గాలికి వేడిని, తేమను జతచేసే హుమిడిఫైయర్ పరికరం కూడా ఈ వెంటిలేటర్‌లో ఉంటుంది. పేషెంట్ల శ్వాసను పూర్తిగా మెషీన్ నియంత్రిస్తుంది కాబట్టి వారి శ్వాసకోశ కండరాలు విశ్రాంతి తీసుకునేలాగా వైద్యం అందుతుంది. దీంతో పాటు మూత్రాన్ని సేకరించడానికి ఒక పైపు, వ్యర్థం సేకరించడానికి బట్ చుట్టూ ఒక స్టిక్కీ బ్యాగ్, మెడిసన్ ఇవ్వడానికి IV లైను, నిరంతరం బిపిని పర్యవేక్షించడానికి మరో లైన్ శరీరాన్ని బంధించి ఉంటాయి. ప్రతి రెండు గంటలకు అవయవాలను పునః స్థాపించడానికి, ఉష్ణోగ్రత తగ్గించడంలో సహాయపడటానికి, చల్లటి ద్రవాన్ని ప్రసరించే బెడ్ మీద పడుకోబెడతారు. వెంటిలేటర్ మీద ఉన్న సమయంలో రోగి మాట్లాడలేడు, తినలేడు, సహజంగా ఏ పనీ చేయలేడు. తిరిగి మామూలుగా జీవించేవరకూ (లేదా చనిపోయే వరకూ) అక్కడే ఉండాలి. ఈ యంత్రం మనిషిని సజీవంగా ఉంచుతుందంతే. రెండు నుండి మూడు వారాల వరకూ కదలకుండా ఉండాలి. ఆ అసౌకర్యం మరియు నొప్పి అంతా ఇంతా కాదు.

రోగి శరీరంలో కలిగే మార్పులు

రోగికి అవసరమయ్యే మందులు ఇవ్వటానికి డాక్టర్లు, నర్సుల బృందాలు, మరియు వ్యర్థం తీసే వర్కర్లు చాలామంది నిరంతం పర్యవేక్షిస్తూ ఉంటారు. రోజుకి తక్కువలో తక్కువ వెంటిలేటర్ కు అయ్యే ఖర్చు 50 వేల పై మాటే. కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షకు పైగా ఫీజు వసూలు చేస్తారు. చికిత్స జరిగే 10-20 రోజుల్లో రోగి 40% కండర ద్రవ్యరాశిని కోల్పోతాడు. నోరు, స్వర తంతుల గాయం, పల్మనరీ, గుండె సమస్యలు రావొచ్చు. ఈ కారణంగానే వృద్ధులు, లేదా అప్పటికే బలహీనంగా ఉన్నవారు చికిత్సను తట్టుకోలేక చనిపోతారు.

ఆ వేదన వర్ణనాతీతం…

మామూలుగా ఉదయం కాస్త ఆలస్యంగా నిద్ర లేస్తేనే ఒంటినొప్పులతో బాధ పడుతుంటాం. అటువంటిది 20 రోజులపాటు కదలకుండా పడుకుంటే ఎంతటి శారీరక, మానసిక వ్యధను అనుభవిస్తారో మాటల్లో చెప్పలేం. రోగి ఎక్కువ సేపు స్పృహలో ఉండడు. మధ్యలో మెలకువ వస్తే బయట తిరిగిన ప్రకృతి అందాలు గుర్తొస్తాయి స్వేచ్చ విలువ తెలుస్తుంది, దాన్ని ఎందుకు దుర్వినియోగ పరచుకున్నామా అని బాధ పశ్చాత్తాపం కలుగకమానవు. ఆత్మీయులు గుర్తొస్తే కంటి చివర నీటి చుక్కలు రాలుతుంటాయి. ఆ పరిస్థితి నుండి ఎప్పుడెప్పుడు బయట పడతామా అనే ఆందోళన ఒకవైపు, అంత్య స్థితి నుండి బయటపడతామ లేదా అనే నిస్పృహ మరోవైపు వేధిస్తుంటాయి. జీవితంలో చేయకుండా మిగిలిపోయిన పనులు గుర్తు రాబోయే లోపులో మళ్ళీ స్పృహ తప్పుతుంది.

ఈ కథనంలో వెంటిలేటర్ పై ఉండే ఒక రోగి అనుభవాలను భయపెట్టేందుకు కాకుండా ప్రతి ఒక్కరి జాగ్రత్త కోసంగా భావించండి. మీ ఇంట్లో పెద్దవాళ్లకు, స్నేహితులందరికీ వివరించండి. ప్రమాదాల నుండి అప్రమత్తంగా ఉండటం తో పాటు కరోనా వ్యాప్తిని ఆపడానికి మీ వంతు సహకారం అందించండి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here