శేరిలింగంపల్లి, ఏప్రిల్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): కిరాణా సరుకులు తెచ్చేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వృద్ధుడు అదృశ్యమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం గండ్రెడు లంక గ్రామానికి చెందిన రాయుడు సత్యం చందానగర్‌లోని డిఫెన్స్ కాలనీ లక్ష్మీ రెసిడెన్సీలో నివాసం ఉంటూ స్థానికంగా డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సత్యం తండ్రి రాయుడు ఏడుకొండలు (60) వారం రోజుల కిందట నగరానికి తన కొడుకును చూసేందుకు వచ్చాడు. ఏప్రిల్ 2వ తేదీన రాత్రి 7.30 గంటల సమయంలో కిరాణా సరుకులు తెచ్చేందుకు ఇంటి పక్కనే ఉన్న షాప్‌కు వెళ్లాడు. అనంతరం తిరిగి రాలేదు. తన తండ్రి జాడ కోసం సత్యం చుట్టు పక్కల, తెలిసిన వారు, బంధువులు, స్నేహితుల వద్ద విచారించాడు. అయినా ఫలితం లేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా రాయుడు ఏడుకొండలు ఎత్తు 5 అడుగుల 3 అంగుళాలు ఉంటాడని, తెలుపు రంగులో ఉంటాడని, ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు పసుపు రంగు చొక్కా, లుంగీ ధరించి ఉన్నాడని, అతను తెలుగు మాట్లాడుతాడని ఎవరైనా గుర్తు పడితే తమకు సమాచారం అందించాలని చందానగర్ పోలీసులు తెలిపారు.