మారబోయిన వారి పార్టీ మార్పు ఖరారు – ఫలించని టిపిసిసి నేతల బుజ్జగింపులు

  • నేడు సా.4 గం.లకు బిజెపిలో చేరనున్న తండ్రి తనయులు
  • పార్టీ మారేందుకు పలువురు మైనారిటీ, యూత్ నాయకుల విముఖత
  • చేరికను జీర్ణించుకోలేకపోతున్న స్థానిక బిజెపి నేతలు
  • తొమ్మిది డివిజన్లు, నియోజకవర్గ ఎన్నికల బాధ్యత…?

శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి రాజకీయాల్లో అర్ధరాత్రి సంచలనాలకు తెరలేపిన మాజీ ఎమ్మెల్యే మారబోయిన బిక్షపతియాదవ్, శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ రవికుమార్ యాదవ్ ల భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత వచ్చేసింది. రాజీనామాలను ఆమోదించకుండా పార్టీలోనే కొనసాగించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానం విశ్వ ప్రయత్నాలు చేసినా చర్చలు సఫలీకృతం కాలేదు. రవికుమార్ యాదవ్, బిక్షపతి యాదవ్ లను కాంగ్రెస్ పెద్దలు బుజ్జగించినప్పటికీ వారు తమ నిర్ణయాన్ని మార్చుకునేందుకు సుముఖత చూపలేదు. దీంతో తండ్రి తనయులు పార్టీ శ్రేణులతో కలిసి ఈ సాయంత్రం 4 గం.లకు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, జిహెచ్ఎంసి ఎన్నికల ఇంచార్జ్ భూపేందర్ యాదవ్ సమక్షంలో బిజెపి కండువా కప్పుకోనున్నారు.

బిక్షపతి యాదవ్ తో చర్చిస్తున్న టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.

ఫలించని బుజ్జగింపులు…

గ్రేటర్ ఎన్నికల సమయంలో బిక్షపతి యాదవ్ పార్టీని వీడుతుండటంతో కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగి బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, మల్లు రవి, కూన శ్రీశైలంలతో పాటు పలువురు సీనియర్ నాయకులు బుధవారం ఉదయం బిక్షపతియాదవ్ ఇంటికి చేరుకుని నిర్ణయం మార్చుకునేలా చర్చలు జరిపినప్పటికీ అందుకు బిక్షపతియాదవ్ అంగీకారం తెలుపలేదు. రవికుమార్ యాదవ్ సైతం పార్టీ మార్పు పై కాంగ్రెస్ పెద్దలతో చర్చించేందుకు దూరంగా ఉండటం పార్టీ మార్పు నిర్ణయానికి బలం చేకూర్చింది. దీంతో కాంగ్రెస్ పెద్దలు నిర్ణయాన్ని వారికే వదిలివేసి నిరుత్సాహంతో వెనుదిరిగారు.

మైనారిటీ, యూత్ నాయకుల విముఖత …

బిక్షపతి యాదవ్, రవికుమార్ యాదవ్ లతో కలిసి పార్టీ మారేందుకు పలువురు మైనారిటీ వర్గాలు, యూత్ నాయకులు సిద్ధంగా లేనట్లు సమాచారం. శేరిలింగంపల్లి నియోజకవర్గం లో కాంగ్రెస్ కు ప్రధాన ఓటు బ్యాంక్ గా ఉన్న మైనారిటీ నాయకులు బిజెపి లో పనిచేసేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ నుండి కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా ఎంపికైన మహిపాల్ యాదవ్ తో పాటు పలువురు యూత్ నాయకులు సైతం పార్టీ మారేందుకు విముఖత చూపిస్తున్నట్లు సమాచారం. కాగా మైనారిటీ, యూత్ నాయకులను సముదాయించి బిజెపి లో చేర్చేందుకు బిక్షపతి యాదవ్, రవికుమార్ యాదవ్ లు చర్చలు జరుపుతున్నారు.

చేరికను ఆహ్వానించని స్థానిక బిజెపి శ్రేణులు…

కాగా పార్టీలో చేరేందుకు గానూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి లో గల 10 డివిజన్లలో చందానగర్ మినహా 9 డివిజన్లతో పాటు శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎన్నికల బాధ్యతను ఇచ్చేందుకు బిజెపి అధిష్టానం హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక భిక్షపతి యాదవ్, రవికుమార్ యాదవ్ లు బీజేపీ పార్టీలో చేరుతారనే విషయాన్ని స్థానిక బిజెపి శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. వారిని పార్టీలో చేర్చుకునేందుకు బిజెపి అధిష్టానం సిద్ధంగా ఉన్నప్పటికీ శేరిలింగంపల్లి సీనియర్ బిజెపి నాయకులు మాత్రం చేరికను అంగీకరించేందుకు సిద్ధంగా లేరు. ఇతర పార్టీల నుండి వలసలతో దశాబ్దాలుగా పార్టీకోసం కష్టపడ్డ బిజెపి నాయకులకు అన్యాయం జరుగుతుందని పలువురు నాయకులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక బిజెపి నాయకుల అభిప్రాయం మేరకు బిక్షపతి యాదవ్, రవికుమార్ యాదవ్ లకు 4 – 6 సీట్లు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

2 COMMENTS

  1. Nayakulu kashta kaalamlo party ni vadali pokudadu nammina siddantalanu kaapadaali, votes maatram padaw kottanayakulu pudutaru .party ni balopetam chestaru party shahvitam, nayakulu kaadu. Kaarya kartalu mukyam

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here