శేరిలింగంపల్లి, ఆగస్టు 4 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ అధ్యక్షతన అన్ని విభాగాల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జోన్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న అంశాలపై సమావేశంలో సవివరంగా చర్చించారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్, సిటీ ప్లానర్, అర్బన్ బయోడైవర్సిటీ అధికారులు, ఫైనాన్స్ అడ్వైజర్, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ (సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్), అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ తదితరులు పాల్గొన్నారు.

శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారంపై చర్చించారు. వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను వెంటనే క్లియర్ చేసి సకాలంలో పరిష్కరించాలని జోనల్ కమిషనర్ ఆదేశించారు. జోన్ పరిధిలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు, సిబ్బంది వేతనాల చెల్లింపు ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. అలాగే పార్కుల నిర్వహణ, మొక్కల సంరక్షణ, పచ్చదనం పెంపుకు సంబంధించిన అర్బన్ బయోడైవర్సిటీ పనుల పురోగతిని పరిశీలించారు. రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించిన జోనల్ కమిషనర్, భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన బిల్డ్ నౌ పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
దోమల నివారణ, సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం జోన్ పరిధిలో ఫాగింగ్ కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, నిర్దేశిత గడువులోగా పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేయాలని జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ అధికారులను ఆదేశించారు.





