శేరిలింగంపల్లి, ఆగస్టు 3 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకూ బలోపేతం అవుతోందని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు గులాబీ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో సోమవారం మాదాపూర్ డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు మదనాచారి బీఆర్ఎస్‌లో చేరారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రోత్సాహంతో, బొబ్బ నవత రెడ్డి సహకారంతో, శ్రీనివాస్ గౌడ్, రాయల కార్తిక్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) మదనాచారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతోపాటు లక్ష్మణ్, నరేందర్ రెడ్డి, అభినంద్ తదితర నాయకులు పాల్గొన్నారు.





