శేరిలింగంపల్లి, ఆగస్టు 3 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 35 ఫిర్యాదులు స్వీకరించారు. సీఎంసీ కమిషనర్ సృజన వివిధ శాఖల విభాగాధిపతులతో కలిసి ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించి, ప్రతి ఫిర్యాదును వ్యక్తిగతంగా పరిశీలించారు. ప్రజలు ప్రస్తావించిన సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు. స్వీకరించిన ప్రతి ఫిర్యాదుకు ప్రత్యేక గ్రీవెన్స్ ఐడి (Grievance ID), ట్రాకింగ్ లింక్ కేటాయించి సంబంధిత శాఖలకు పంపించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవడంతోపాటు, ప్రతి కేసు పురోగతిని నిరంతరం పర్యవేక్షించి సకాలంలో పరిష్కారం అందించాలని అధికారులకు సూచించారు.

విభాగాల వారీగా అందిన ఫిర్యాదుల్లో టౌన్ ప్లానింగ్ విభాగానికి అత్యధికంగా 21 ఫిర్యాదులు వచ్చాయి. ఇంజినీరింగ్ విభాగానికి 9, ఫైనాన్స్, అకౌంట్స్ విభాగానికి 3, అర్బన్ బయోడైవర్సిటీ విభాగానికి 2 ఫిర్యాదులు అందాయి. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ప్రజలు తమ సమస్యలను నేరుగా కమిషనర్, అధికారుల దృష్టికి తీసుకువచ్చే సమర్థవంతమైన వేదికగా కొనసాగుతోందని, పారదర్శకంగా, సమయపాలితంగా ఫిర్యాదుల పరిష్కారానికి ఇది దోహదపడుతోందని అధికారులు తెలిపారు.





