లిఫ్ట్ మరమ్మత్తుల నిర్లక్ష్యానికి మ‌హిళ‌ బలి.. అపార్ట్‌మెంట్‌లో దుర్మరణం..

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 4 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ మరమ్మత్తుల సమయంలో జరిగిన ఘోర ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటనపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం.. నల్లగండ్ల ఎస్సీ కాలనీకి చెందిన దాడి శ్రీనివాస్ తన భార్య అనసూయ (43)తో కలిసి ఆగస్టు 4న ఉదయం సుమారు 11 గంటల సమయంలో చందానగర్‌లోని అన్నపూర్ణ ఎన్‌క్లేవ్, చాట్వాజ్ మెన్షన్ అపార్ట్‌మెంట్‌లో విశ్రాంతి తీసుకుంటున్న తన మేనమామ దాడి గోవింద్‌ను పరామర్శించేందుకు వెళ్లారు.

అపార్ట్‌మెంట్ గ్రౌండ్ ఫ్లోర్‌లో లిఫ్ట్ వద్దకు చేరుకున్న అనంతరం ముందుగా శ్రీనివాస్ లిఫ్ట్‌లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత అనసూయ లిఫ్ట్‌లోకి ఎక్కుతున్న సమయంలో ఒక కాలు లోపల పెట్టి, మరో కాలును లోపలికి తీసుకువస్తుండగానే లిఫ్ట్ తలుపులు పూర్తిగా మూసుకోకముందే అకస్మాత్తుగా పైకి కదలడం ప్రారంభించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆమె లిఫ్ట్, ప్రవేశ ద్వారం మధ్య ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడగా అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కేకలు విన్న అపార్ట్‌మెంట్ నివాసితులు వెంటనే ఆమెను బయటకు తీసి చందానగర్‌లోని అర్చనా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులు నిజాంపేటలోని మరో ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో లిఫ్ట్ మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయని, లిఫ్ట్ టెక్నీషియన్ అనిల్ కుమార్ ప్రధాన విద్యుత్ సరఫరాను నిలిపివేయకుండా పనులు చేపట్టడంతోపాటు, నివాసితులకు హెచ్చరికగా ఎలాంటి కాషన్ లేదా వార్నింగ్ బోర్డులు ఏర్పాటు చేయలేదని ఫిర్యాదుదారుడు ఆరోపించాడు.

అలాగే లిఫ్ట్ టెక్నీషియన్ అనిల్ కుమార్ నిర్లక్ష్యంతోపాటు అపార్ట్‌మెంట్ అసోసియేషన్ సభ్యులు రామ్ రెడ్డి, యోగేందర్, వెంకట్ రెడ్డి, అలాగే లిఫ్ట్ నిర్వహణ సంస్థ జాన్సన్ ఎలివేటర్స్ యాజమాన్యం నివాసితుల భద్రతను నిర్ధారించడంలో విఫలమైనందువల్లే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంటూ, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here