మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్లోని దుర్గం చెరువులో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో దుర్గం చెరువు బ్రిడ్జి కింద చెరువులో ఓ వ్యక్తి మృతదేహం పడి ఉందని సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి మృతదేహాన్ని బయటికి తీసి చూశారు. మృతుని జేబులో షేక్ బిలాల్ హుస్సేన్, విశాఖపట్నం అని ఆధార్ కార్డు ఉంది. దీంతో అతని పేరు షేక్ బిలాల్ హుస్సేన్ అని, వయస్సు 24 సంవత్సరాలు అని, విశాఖపట్నంకు చెందిన వాడని పోలీసులు గుర్తించారు.
కాగా ఈ నెల 18వ తేదీన అతను ఉదయం ఇండిగో విమానంలో విశాఖ నుంచి నగరానికి వచ్చాడని, ఈ మేరకు అతని వద్ద ఓ టిక్కెట్ ఉందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు అతని మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా అతని ఆత్మహత్యకు సరైన కారణం తెలియదని, ఆ విషయం అతని కుటుంబ సభ్యులు వచ్చాక తెలుస్తుందన్నారు. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు అతను బీటెక్ పూర్తి చేశాడని, ఉద్యోగం లేకపోవడంతో మనోవ్యథతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కాగా అతను ఇంట్లో బై అని లెటర్ రాసి పెట్టి వచ్చినట్లు తెలిసింది.