తెలంగాణలో జనవరి నుండి మ్రోగనున్న బడి గంటలు..?

  • మూడు నెలల పాటు జరుగనున్న తరగతులు
  • ఆపై విద్యా సంవత్సరపు వార్షిక పరీక్షలు
  • రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా శాఖ ప్రతిపాదన

నమస్తే శేరిలింగంపల్లి: కరోనా కారణంగా మూతపడ్డ పాఠశాలలు నేటికీ తెరుచుకోలేదు. పాఠశాలలతో పాటు, కళాశాల విద్యార్థులకు సైతం వివిధ మాధ్యమాలలో ఆన్లైన్ తరగతులు జరుగుతుండగా తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల పునః ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. 9, 10 వ తరగతి, ఇంటర్‌ విద్యార్థులకు పాఠశాలల్లో తరగతులకు కేంద్రం నవంబరు నెలలోనే అనుమతించినప్పటికీ తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలివేయడంతో తెలంగాణ సహా చాల రాష్ట్రాలు నేటికీ ఆన్లైన్ విద్యాబోధననే కొనసాగిస్తున్నాయి. అయితే తాజాగా రాష్ట్ర విద్యాశాఖ అధికారులు పాఠశాలలు, కళాశాలల్లో తరగతుల ప్రారంభించే విషయంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, ఈ విషయంలో సర్కారు త్వరలోనే నిర్ణయం వెలువరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కౌన్సిల్‌ ఫర్‌ ద స్కూల్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్స్ జనవరి నెల నుండి పాఠశాలలను పాక్షికంగా ప్రారంభించాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ముఖ్య కార్యదర్శులకు లేఖలో కోరింది. ప్రధానంగా బోర్డ్ పరీక్షలు రాసే 10 , ఇంట్రర్మీడియేట్ విద్యార్థులకు పాఠశాలల్లో తరగతులు నిర్వహించాలని పేర్కొనగా, ‌ పాఠశాలల పునః ప్రారంభం పై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రభుత్వ స్కూల్‌ టీచర్ల సంఘాల నాయకులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, ప్రైవేట్‌ స్కూల్‌ యాజమాన్యాలు బడులు తెరవాలని కోరుతున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ముగియడానికి మరి కొన్ని నెలలు మాత్రమే మిగలడంతో పాఠశాలలు తెరవాలని ప్రభుత్వం భావిస్తోంది. వార్షిక పరీక్షలు నిర్వహించే ముందు పాఠశాలలను కనీసం మూడునెలలపాటు విద్య సంస్థల్లో తరగతులు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.

ప్రభుత్వం అనుమతిస్తే జనవరి మొదటివారంలో పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. ముందుగా 9, 10 తరగతులు, జూనియర్‌ కాలేజీలలో రెగ్యులర్‌ క్లాసులు నిర్వహించేందుకు విద్యాశాఖ ప్రతిపాదనలు రూపొందించింది. ఆ తరువాత దశల వారీగా 6 నుంచి 8, ఆ తర్వాత ప్రాథమిక తరగతులను క్రమంగా నిర్వహించేందుకు సర్కారు సంసిద్ధత వ్యక్తం చేస్తోంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here