శేరిలింగంపల్లి, నవంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్పేట్ ఫ్లైఓవర్ కింద గాయాలతో పడి ఉన్న గుర్తుతెలియని వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 14వ తేదీ ఉదయం సుమారు 9 గంటల సమయంలో హఫీజ్పేట్ ఫ్లైఓవర్ కింద 60 నుంచి 65 ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని వృద్ధురాలు గాయాలతో పడి ఉన్నట్లు డయల్-112కు సమాచారం అందింది. వెంటనే స్పందించిన మియాపూర్ పెట్రోలింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, 108 అంబులెన్స్ సహాయంతో ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవంబర్ 17వ తేదీ రాత్రి 7.06 గంటలకు వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటనపై హెడ్ కానిస్టేబుల్ డి. శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు క్రైమ్ నంబర్ 1640/2026 కింద బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 194 ప్రకారం కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తును హెడ్ కానిస్టేబుల్ పి. మల్లేష్ (హెచ్సీ-3044)కి అప్పగించినట్లు మియాపూర్ పోలీసులు వెల్లడించారు.





