పోలీస్ అధికారి బంటు రాములు జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ

శేరిలింగంపల్లి, మే 16 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): ప్రముఖ పోలీసు అధికారి బంటు రాములు జీవిత గాథ ఆధారంగా రచించిన ధీశాలి బంటు రాములు పోలీస్ అధికారి – సంఘర్షణ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో బంటు రాములుని ఘనంగా సన్మానించారు. మారుమూల గ్రామమైన కడుమూరులో పేద కుటుంబంలో జన్మించిన బంటు రాములు కష్టపడి చదువుకొని పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగి డీఎస్పీ స్థాయికి చేరుకోవడం విశేషమని భేరి రామచంద్ర యాదవ్ కొనియాడారు. 38 సంవత్సరాల పాటు ఎలాంటి మచ్చలేని సేవలు అందించి ప్రజల ప్రశంసలు పొందిన ఆయన సేవలు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీసీ ఐక్యవేదిక బృందం బంటు రాములు స్వగృహాన్ని సందర్శించి శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేసింది. గ్రామీణ పేదరికాన్ని జయించి ఉన్నత స్థానానికి చేరుకోవడమే కాకుండా, తన పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతూ అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా వంటి దేశాల్లో స్థిరపడేలా చేయడం ఆయన జీవితంలో గొప్ప విజయమని సభలో పలువురు అభిప్రాయపడ్డారు.

బంటు రాములు జీవిత విశేషాలను మిత్రులు జగదీష్, భిక్షమయ్య సహకారంతో పుస్తక రూపంలో తీసుకురావడం పేద విద్యార్థులు, యువతకు మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. పోలీస్ అధికారిగా సేవలందించిన సమయంలో క్లిష్టమైన కేసులను ఛేదించి నేరస్థులను శిక్షించే వరకు వెనుకడుగు వేయని అధికారి బంటు రాములు అని గుర్తుచేశారు. రిటైర్మెంట్ అనంతరం కూడా బంటు రాములు ప్రజాసేవ కొనసాగిస్తున్నారని, యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం, పేదలకు సహాయం చేయడం అభినందనీయమని తెలిపారు. స్వగ్రామం పూడూరు ప్రాంతంలో విద్యార్థులకు పుస్తకాలు, నోటుబుక్స్ పంపిణీ చేయడంతోపాటు ప్రత్యేక ఉపాధ్యాయులను నియమించి వారి వేతనాలను భరించడం ఆయన సేవాభావానికి నిదర్శనమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్కే సాయన్న ముదిరాజ్, యువ నాయకుడు చంద్రశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం బంటు రాములు బేరి రామచంద్ర యాదవ్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here