శేరిలింగంపల్లి, జూన్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): నేతాజీ నగర్ కాలనీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని కాలనీ అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో పేరు, చిరునామా లేదా ఇతర వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని ప్రత్యేక సవరణ ప్రక్రియ ద్వారా తప్పనిసరిగా సరిచేసుకోవాలని సూచించారు. ఓటు సాధారణ విషయం కాదని, ప్రతి పౌరుడి ప్రజాస్వామ్య హక్కు మాత్రమే కాకుండా భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన సాధనమని పేర్కొన్నారు. కాలనీలోని ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

నేతాజీ నగర్ కాలనీలో దాదాపు 3వేల మంది ఓటర్లు ఉన్నప్పటికీ ప్రస్తుతం నల్లగండ్లలోకి వెళ్లి ఓటు వేయాల్సి వస్తోందని తెలిపారు. దీంతో కాలనీకి సమీపంలోనే ప్రత్యేక పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేయాలని ఎన్నికల అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ నోడల్ అధికారి దీపక్, బీఎల్ఓ పరమేష్, నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రాయుడు, తిరుమలేష్, మౌలానా తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లకు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై అవగాహన కల్పించి, సవరణల కోసం దరఖాస్తులు చేసుకునేలా ప్రోత్సహించారు.





