ఎస్‌ఐఆర్ పరిశీలన ముమ్మరం.. బీజేపీపై సామల్ కార్తీక్ విమర్శలు..

శేరిలింగంప‌ల్లి, జూలై 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి ఓటర్ జాబితా పరిశీలన కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ కార్యదర్శి సామల్ కార్తీక్ తెలిపారు. బూత్ లెవెల్ అధికారులతో కలిసి బూత్ కమిటీ సభ్యులు ప్రతి ఓటును పరిశీలిస్తూ ఓటర్లను నేరుగా కలిసి ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించారని చెప్పారు. ఓటర్లకు ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ, వారి ఓటు హక్కు పరిరక్షణకు అవసరమైన సూచనలు అందించినట్లు వెల్లడించారు. మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సూచన మేరకు వివిధ ప్రాంతాల్లో బూత్ స్థాయి అధికారులకు ఓటర్లను సమన్వయం చేస్తూ, ఓటర్ జాబితా పరిశీలన ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగేలా సహకరించాలని పార్టీ నాయకులు కోరారు.

ఈ సందర్భంగా నిర్వహించిన బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో సామల్ కార్తీక్ మాట్లాడుతూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ పర్యటనలో బెంగాల్ తరహా రాజకీయాలు రాష్ట్రంలో చేయాలని వ్యాఖ్యానించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఎలాంటి ఆరోపణలకు అవకాశం లేకుండా ఎస్‌ఐఆర్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన కేరళ రాష్ట్రాన్ని ఆదర్శంగా ఎందుకు తీసుకోవడం లేదో బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి ఓటరు తన ఓటు హక్కును పూర్తిగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని బూత్ కమిటీ సభ్యులకు సూచించారు. తెలంగాణలో కృత్రిమ అశాంతి సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించిన ఆయన, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ కారణంగా ఒక్క ఓటరు కూడా తన ఓటు హక్కును కోల్పోకుండా అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని బూత్ కమిటీ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో యువజన, విద్యార్థి సంఘాల నాయకులు, స్థానిక నేతలతోపాటు శ్రీను, అశోక్, శ్రీధర్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here