శేరిలింగంపల్లి, జూలై 1 (నమస్తే శేరిలింగంపల్లి): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్వహిస్తున్న వన్ వార్డ్ ఎవరీ డే కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన, జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్‌తోపాటు వివిధ శాఖల అధికారులు కూకట్‌పల్లి జోన్, కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలోని కూకట్‌పల్లి వార్డును సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక నివాసితులు, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ల ప్రతినిధులతో సమావేశమైన అధికారులు వార్డు పరిధిలో నెలకొన్న పౌర సమస్యలపై సమీక్ష నిర్వహించారు.

సమావేశంలో వీధి దీపాల మెరుగుదల, యూజీడీ పొంగిపొర్లే సమస్యల పరిష్కారం, పాఠశాలల సమీపంలో నీటి నిల్వ నివారణ, పాఠశాలల వద్ద రోడ్డు భద్రతా చర్యలు, నల్ల చెరువు అభివృద్ధి, ప్రజా సౌకర్యాల విస్తరణ వంటి అంశాలను స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం కమిషనర్ సంబంధిత ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ, ట్రాఫిక్ పోలీసు శాఖ, హైడ్రా అధికారులతో సమన్వయం చేసుకుని అవసరమైన పనులను ప్రాధాన్యత ఆధారంగా చేపట్టి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.





