శేరిలింగంపల్లి, జూలై 1 (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ ఎక్స్‌రోడ్స్ వద్ద యువకుడి చేతిలోని సెల్‌ఫోన్‌ను లాక్కునేందుకు యత్నించిన నిందితుడిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్లు, సంగారెడ్డి జిల్లాలో పలు చోరీ, సెల్‌ఫోన్ స్నాచింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్న రాథ్లావత్ మహేష్ అలియాస్ హఫీజ్‌పేట్ మోడల్ మహేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 1న ఉదయం 11.30 గంటల సమయంలో కొండాపూర్ మసీదుబండ శ్రీరామ్‌నగర్‌లోని హనుమాన్ హాస్టల్‌లో ఉంటున్న బి. వినోద్ (25) ఆల్విన్ ఎక్స్‌రోడ్స్ నుంచి హఫీజ్‌పేట్ వైపు వెళ్లే మార్గంలో విధులకు వెళ్లే ముందు తన వివో U50 మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతుండగా, వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఫోన్‌ను లాక్కునేందుకు ప్రయత్నించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సీసీటీవీ దృశ్యాలు, ఇతర ఆధారాలను పరిశీలించిన పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో నిందితుడు రాథ్లావత్ మహేష్ అలియాస్ హఫీజ్‌పేట్ మోడల్ మహేష్ పై గచ్చిబౌలి, కూకట్‌పల్లి, మధురానగర్, రాయదుర్గం, మియాపూర్, బంజారాహిల్స్, నార్సింగి, గోపాలపురం, సదాశివపేట్ తదితర పోలీస్ స్టేషన్లలో మొత్తం 19కు పైగా చోరీ, సెల్‌ఫోన్ స్నాచింగ్ కేసులు ఉన్నట్లు వెల్లడైంది. నిందితుడు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సెల్‌ఫోన్లు లాక్కునే ప్రయత్నాలకు పాల్పడేవాడు. ఈ కేసులో ఎలాంటి వస్తువులు స్వాధీనం కాలేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడిపై తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి.





