మాదాపూర్‌లో సీనియర్ సిటిజన్ల ఆర్ట్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, జూన్ 30 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్‌లో ఉన్న మహేంద్ర అశ్విత అపార్ట్‌మెంట్‌లో అశ్విత సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ (ASCA) ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ సిటిజన్లు తమలోని సృజనాత్మకతను వెలికితీస్తూ ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. వృద్ధాప్యాన్ని కేవలం కాలక్షేపంగా కాకుండా, తమలో దాగి ఉన్న కళాత్మక ప్రతిభను అద్భుతమైన కళాఖండాల రూపంలో ప్రదర్శించడం గొప్ప విషయమని కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా వారు యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.

వయోవృద్ధుల సంక్షేమానికి తన వంతు సహకారం అందిస్తానని, ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటానని ఆరెకపూడి గాంధీ హామీ ఇచ్చారు. యువత సీనియర్ సిటిజన్ల జీవిత అనుభవాలు, క్రమశిక్షణ, సృజనాత్మకతను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం మంగ‌ళ‌వారం జన్మదినం జరుపుకున్న‌ సీనియర్ సిటిజన్లకు ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అశ్విత సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ (ASCA) అధ్యక్షుడు నాదెండ్ల పాపారావుతోపాటు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బాలింగ్ గౌతమ్ గౌడ్, గుమ్మడి శ్రీనివాస్, సాంబయ్య, రామచందర్, ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here