రాత్రి వేళ ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్

శేరిలింగంప‌ల్లి, జూలై 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి వేళ ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న భూక్య మహేష్ అలియాస్ బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇంటి చోరీ ఘటనపై ఫిర్యాదు అందిన వెంటనే మియాపూర్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టి సాంకేతిక ఆధారాలు, ఇతర క్లూస్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భూక్య మహేష్‌కు సైబరాబాద్ కమిషనరేట్‌తోపాటు మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేలింది. గతంలో ఎస్‌ఆర్‌నగర్, బాలానగర్, మియాపూర్, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, కీసర పోలీస్ స్టేషన్లలో నమోదైన పలు చోరీ, ఇతర కేసుల్లో అతడు నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసుల విచారణలో నిందితుడు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో రాత్రి వేళ కాలనీల్లో సంచరిస్తూ తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకునేవాడని వెల్లడైంది. ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఎలాంటి వస్తువులు స్వాధీనం కాలేదని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లను తాళం వేసి బయటకు వెళ్లే సమయంలో తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. కాలనీల్లో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని లేదా డయల్ 100కు కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ వివరాలను మాదాపూర్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఒక‌ ప్రకటనలో వెల్లడించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here