- బిజెపి మేనిఫెస్టో లో ఉచిత విమాన సదుపాయం ఎక్కడుందో చూపాలి: మొవ్వ సత్యనారాయణ
నమస్తే శేరిలింగంపల్లి: ప్రతిపక్ష పార్టీలపై అసత్య ప్రచారాలతో, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండానే అబద్దాలు ఆడటంలో కేటీఆర్ తండ్రిని మించిపోయాడని శేరిలింగంపల్లి బిజెపి నాయకులు మొవ్వ సత్యనారాయణ అన్నారు. గురువారం శేరిలింగంపల్లి నియోజక వర్గంలో టిఆర్ఎస్ పార్టీ రోడ్ షోలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బిజెపి మేనిఫెస్టోలో కేటీఆర్ ప్రచారం చేస్తున్న మహిళలకు ఉచిత విమాన సదుపాయం హామీ ఎక్కడ ఉందొ చూపాలన్నారు. రాష్ట్ర మంత్రి పదవిలో ఉండి ప్రజల సాక్షిగా అబద్దాలు ఆడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల్లో ఓట్లు సాధించొచ్చనే దురాలోచనతో వరద బాధితులకు పార్టీ నాయకులతో 10 వేల రూపాయలు పంపిణీ చేశారని, నాయకుల చేతివాటంతో వరద సాయం బెడిసి కొట్టడంతో మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రకటనలు చేశారన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఎన్నికల సంఘం వరద సాయాన్ని తాత్కాలికంగా నిలిపి వేయాలని ఆదేశాలు ఇస్తే, పేదోడి నోటికాడి ముద్దను బీజేపీ లాగేసిందంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. మజ్లీస్ పార్టీతో లోపాయికారి ఒప్పదం చేసుకుని, ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రజలు ముందు ఒకరినొకరు విమర్శలు చేసుకుంటున్నారని అన్నారు. బిజెపి సహాయం లేకుండానే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వడం చేతకాక ఆ తప్పును కేంద్రపై నెడుతున్నారని, గత ఏడేళ్లలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు గుంపులుగా వస్తున్నారంటూ విమర్శిస్తున్న కేటీఆర్ డివిజన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను గ్రేటర్లో గుంపులుగా ఎందుకు తిప్పుతున్నాడో చెప్పాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా మత కలహాలు లేవని, బీజేపీ పై మతతత్వ ముద్ర వేసి ప్రజలకు ప్రచారం చేస్తున్నారని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా ఎన్నికల్లో విజయం సాధించేది బీజేపీయేనని తెలిపారు.