హైడ్రా డిప్యూటీ కలెక్టర్ మాదాపూర్ లో పర్యటన

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం సిపిఎం ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా డిప్యూటీ కలెక్టర్ విజయ్ కుమార్ మాదాపూర్ లోని 41/14 సర్వే నంబర్ల‌లో కొన‌సాగుతున్న అక్రమ నిర్మాణాల‌ను పరిశీలించారు. సిపిఎం నాయకులు శోభన్, కృష్ణ ప్రభుత్వ భూముల పరిరక్షణ కోరుతూ వివరాలు తెలపగా తమ శాఖ నుండి చర్యలు తీసుకుంటామని హైడ్రా సభ్యులు తెలిపారు. ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం ఏ విధంగా జరుగుతుందో డిప్యూటీ కలెక్టర్ కు వివరించారు.

అక్ర‌మ నిర్మాణాన్ని ప‌రిశీలిస్తున్న హైడ్రా డిప్యూటీ క‌లెక్ట‌ర్ విజ‌య్ కుమార్

ఈ సందర్భంగా సిపిఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు శోభన్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి మండలం పరిధిలోని ఖానా మెట్ విలేజ్ లో 41/14 సర్వే నంబర్‌ల‌లో మొత్తం 250 ఎకరాలకు సంబంధించిన ప్రభుత్వ భూమిని గత ప్రభుత్వం వివిధ సంస్థలకు కేటాయించడం జరిగిందని సుమారుగా 70 ఎకరాల భూమి ఇంకా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పటికీ అనేక పర్మిషన్లు తీసుకొని ప్రభుత్వ భూములనే లక్ష్యంగా చేసుకుంటూ ప్రైవేటు సర్వేనెంబర్లు వేసి 41/14లో నిర్మాణాలు చేపడుతున్నారని ఈ విషయంపై గతంలో రెవెన్యూ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఏర్పడిన హైడ్రా కమిషన్ దృష్టికి తీసుకెళ్లగా కమిషన్ సభ్యులు పర్యటించడం తమ పోరాటానికి బలాన్ని ఇచ్చిందని ఆయన తెలిపారు. హైడ్రాపై తమకు సంపూర్ణ నమ్మకం ఉందని ప్రభుత్వ భూముల రక్షణ కోసం హైడ్రాకు తమ పార్టీ వైపు నుండి సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం తమ పార్టీ ఎల్లవేళలా పోరాటాలను నిర్వహిస్తుందని ఆయన గుర్తు చేశారు. కమిషన్ సభ్యులు స్పందించి నేరుగా పరిశీలించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అధికారుల‌ను అడిగి వివ‌రాలు తెలుసుకుంటున్న విజ‌య్ కుమార్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here