శేరిలింగంపల్లి, నవంబర్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (ఐక్య) – (MCPIU), రివల్యూషనరి మార్క్సిస్టు పార్టీ ఆప్ ఇండియా – (RMPI)ల ఆధ్వర్యంలో ఏర్పడ్డ కమ్యూనిస్టు కో-ఆర్డినేషన్ కమిటీ(CCC) సమావేశాలు నవంబర్ 5, 6, 7 తేదీలలో హైదరాబాద్ బాగ్ లింగంపల్లి ఓంకార్ భవన్ లో జరుగుతున్న సందర్భంగా నవంబర్ 7న ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు – మతోన్మాద కార్పోరేట్ శక్తుల ప్రమాదం – వామపక్ష కమ్యూనిస్టు శక్తుల కర్తవ్యం అనే అంశంపై జాతీయ సెమినార్ ను నిర్వహించనున్నామని, ఈ సెమినార్ను విజయవంతం చేయాలని యంసిపిఐ (యు) గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదం శెట్టి రమేష్ పిలుపునిచ్చారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎంఎ నగర్ లో పార్టీ కార్యాలయం ఎదుట పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ సెమినార్ గోడ పత్రిక (పోస్టర్) ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మైదం శెట్టి రమేష్ మాట్లాడుతూ దేశంలో కమ్యూనిస్టు పార్టీలు ఐక్యంగా లేకపోవటం వలన దేశ ప్రజలు ఆర్దికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో తీవ్ర అణిచివేత కు గురై పేదరికం, నిరుద్యోగం, అసమానతలు తీవ్రంగా పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోందని వీటికి మరింత ఆజ్యం పోసినట్టుగా కేంద్రంలో అదికారంలో ఉన్న మైనారిటీ బిజెపి ప్రభుత్వం దేశ ప్రజలపై యుద్దం చేస్తున్నదని, దేశం లో 80 శాతం ఉన్న హిందూ ప్రజలపై జియస్టి పేరుతో, రైల్వే రంగం ప్రైవేటీకరణ పేరుతో, యల్ఐసి, రక్షణ రంగం, విమాన యానం, ఓడ రేవులు, చివరికి యుద్ద రంగంలో వాడుతున్న పరికరాలను కూడా కార్పోరేట్ సంపన్న వర్గాలకు ఆదాని, అంబానీలకు అప్పచెప్పి, 78 సంవత్సరాల కాలం నుంచి ఉన్న విదేశాంగ విధానాన్ని కూడా దెబ్బ కొట్టేందుకు కూడా వెనుకాడడం లేదని అన్నారు.
అందులో బాగంగా నే ఆదాని ఏరో అండ్ డిఫెన్స్ కంపెనీ హెర్మస్ 900 అనే డ్రోన్లను ఇజ్రాయెల్ కు సరపరా చేస్తు బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ల ప్రభుత్వంగా మారుతున్నదని విమర్శించారు. ఈ కార్పొరేట్ వర్గాల దోపిడీ యథేచ్ఛగా సాగేందుకు ఫాసిస్టు విధానాలను అనుసరించి ప్రజా పోరాటాలను ఉద్యమాలను అణిచి వేస్తున్నదని, దీనికి ప్రజా పక్ష పార్టీలు అయిన కమ్యూనిస్టు పార్టీలు తగిన ఐక్య కార్యాచరణతో ముందుకు వెళ్లేందుకు యంసిపిఐ(యు)- ఆర్ఎంపిఐల ఆధ్వర్యంలో కమ్యూనిస్టు కోఆర్డినేషన్ కమిటీ జాతీయ సెమినార్ అక్టోబర్ విప్లవ వార్షికోత్సవ స్పూర్తితో నవంబర్ 7వ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం 10:30 గంటలకు ప్రారంభం అయి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని దీనికి వామపక్ష మేథావులు, విద్యావంతులు, ప్రజాతంత్ర వాదులు, యువత, విద్యార్థి, కార్మిక సకల వర్గాలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్, కార్యదర్శి వర్గ సభ్యులు ఇస్లావత్ దశరథ్ నాయక్, పల్లె మురళి, కమిటీ సభ్యులు పి భాగ్యమ్మ, డి మధుసూదన్, బికె నారాయణ, ఆకుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.