కొండాపూర్(నమస్తే శేరిలింగంపల్లి) : కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వరి కాలనీలో గల పురాతన బావి పునరుద్దరణ పనులను కార్పొరేటర్ హమీద్ పటేల్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానికంగా గల ఈ బావి దశాబ్దాలుగా ఎంతోమంది దాహార్తిని తీర్చిందని గుర్తుచేశారు. కాలక్రమేణా ఈ బావి వినియోగంలో లేకపోవడంతో పాడుబడిందని, స్థానికులు చెత్త చెదారం వేయడంతో పురాతన బావి శిథిలావస్థకు చేరుకుందన్నారు. బావికి పూర్వవైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో, జలవనరులను కాపాడుకోవాల్సిన బాధ్యతతో పునరుద్దరణ పనులను చేపట్టటం జరిగిందన్నారు. బావి చుట్టూ ఉన్న చెత్తను తీయించి, లోతుగా త్రవ్విస్తున్నామని, చెత్త వేయకుండా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయిస్తున్నామన్నారు. బావిలోకి వర్షం నీరు చేరేలా ఏర్పాటు చేశామని ఫలితంగా ఈ పరిసరాలలో భూగర్భ జలాలు పెరిగేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ పర్యటనలో డివిజన్ సెక్రటరీ పేరుక రమేష్ పటేల్, యూత్ నాయకులు దీపక్ తదితరులు పాల్గొన్నారు.