నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ శిల్పా ఎన్‌క్లేవ్‌లోని విశాఖ శ్రీ శారద పీఠపాలిత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయ ప్రాంగణంలో కొనసాగుతున్న లక్ష దీపోత్సవంలో శనివారం పద్మావతి గోధాదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి కనువిందు చేశారు. దీపోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు చందానగర్ శ్రీ వేంకటేశ్వరాలయ సముదాయం నుంచి ఆలయ ప్రధానార్చకులు, పీఠం రాష్ట్ర ఆగమ సలహాదారు శ్రీ సుదర్శనం సత్యసాయి ఆచార్యుల పర్యవేక్షణలో పద్మావతి గోధాదేవి సమేత కల్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను లక్షదీపోత్సవ ప్రాంగణానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. దారిపొడవునా భక్తులు ఉభయదేవేరులతో కూడిన శ్రీవారి దర్శనం చేసుకుని తరించారు. స్థానిక భక్తులు చలసాని జయకృష్ణ, నాగనిఖితల దంపతులచే శ్రీనివాసుడి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిపించారు.
ప్రధానార్చకులు పవనకుమార శర్మ, మురళీధర శర్మ బృందంల పర్యవేక్షణలో కొనాసాగిన ఈ ఉత్సవాలలో ఆలయ వ్యవస్థాపక చైర్మన్ యూవీ రమణమూర్తి, కమిటి సభ్యులు చంద్రశేఖర్, చెన్నారెడ్డి, శిల్పాఎన్‌క్లేవ్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీ వాసులు, ఆలయ సేవాదళం సభ్యులు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పదివేల దీపాలు వెలిగించారు.