ఇద్దరు డైరెక్టర్లు.. నాలుగేళ్లకోసారి 619 కి.మీ.ల పాదయాత్ర

– భద్రాచలం నుండి తిరుమలకు… త్రివేణి, కృష్ణవేణి విద్యా సంస్థల డైరెక్టర్ల యాత్ర

ఆధ్యాత్మికం(నమస్తే శేరిలింగంపల్లి): భగవంతుని పై అపార భక్తి విశ్వసాలు ఉండాలే గానీ భారీ కొండలనైనా అవలీలగా ఎక్కేయొచ్చు. దృఢ సంకల్పంతో చేసే ప్రయత్నంలో భగవంతుని పై ఉండే ఆ విశ్వాసమే మనకు కావాల్సిన శక్తిని అందిస్తుంది. నగరంలోని త్రివేణి, కృష్ణవేణి విద్యా సంస్థలకు చెందిన ఇద్దరు డైరెక్టర్లు వెంకటేశ్వర స్వామి పై గల భక్తి విశ్వసాలతో గత 20 సంవత్సరాలుగా ఆరుసార్లు 619 కి.మీ. పాదయాత్రను చేపడుతున్నారు. సమాజం బాగుండాలనే ఆకాంక్షతో 2000 సంవత్సరంలో భద్రాచలం నుండి తిరుమలకు మొదలెట్టిన ఈ పాదయాత్ర కార్యక్రమం ప్రతీ లీపు సంవత్సరం(నాలుగు సంవత్సరాలకు ఒకసారి) నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ యేడు సెప్టెంబర్ 30వ తేదీన భద్రాచలం నుండి ప్రారంభమైంది వీరి పాదయాత్ర. ఈ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

భద్రాచలం వద్ద యాత్రను ప్రారంభిస్తున్న గొల్లపూడి వీరేంద్ర చౌదరి

త్రివేణి-కృష్ణవేణి విద్యా సంస్థల డైరెక్టర్లు గొల్లపూడి వీరేంద్ర చౌదరి, యార్లగడ్డ వెంకటేశ్వర్లు లు 2000 సం. లో భద్రాచలం నుండి తిరుమలకు 619 పాదయాత్ర చేయాలని సంకల్పించుకుని దిగ్విజయంగా పూర్తి చేశారు. అనంతరం ప్రతీ నాలుగు సంవత్సరాలకు ఒకసారి యాత్ర చేపట్టాలని నిర్ణయించుకుని 6వ సారి యాత్రను సెప్టెంబరు 30వ తేదీన ప్రారంభించి అక్టోబరు 5వ తేదీ నాటికి విజయవాడకు చేరుకున్నారు. యాత్ర విశేషాలను గొల్లపూడి వీరాంధ్ర చౌదరి “నమస్తే శేరిలింగంపల్లి”కి వివరించారు. మొత్తం యాత్రలో 619 కి.మీ. దూరాన్ని 18 రోజులలో పూర్తి చేసి తిరుమల చేరుకోనున్నామని తెలిపారు. ప్రతిరోజూ 30-35 కి.మీ. దూరం నడక సాగిస్తున్నామని తెలిపారు. ఈ నెల 15 వ తేదీనుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని ఉత్సవాలకు హాజరయ్యేలా యాత్రను రూపొందించుకున్నట్లు తెలిపారు. ప్రతీ సంవత్సరం తమతో పాటుగా చాలా మందిని యాత్రలో భాగస్వామ్యం చేసేవారిమని, ఈ యేడు కరోనా కారణంగా ఐదుమంది సభ్యులం మాత్రమే యాత్రలో పాల్గొంటున్నట్లు తెలిపారు. దీంతోపాటు భద్రాచలం నుండి ద్వారకా తిరుమలకు సైతం ప్రతీ సంవత్సరం పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా త్రివేణి, కృష్ణవేణి పాఠశాలాల్లో చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులు పాదయాత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు.

పాదయాత్రలో వీరేంద్ర చౌదరి, వెంకటేశ్వర్లు
Advertisement

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here