- కంచ గచ్చిబౌలిలో పార్కు గోడలు తొలగించి మట్టితో పూడ్చిన వైనం
- చర్యలు తీసుకోవాలని నవోదయ కాలనీ సంక్షేమ సంఘం డిమాండ్
- చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన టౌన్‌ప్లానింగ్ అధికారులు
నమస్తే శేరిలింగంపల్లి: ఇంటి ముందు అడ్డుగా ఉన్నాయని చెత్త కుండిలో, ప్రైవేట్ స్థంభాలో, చివరకు చిన్నపాటి చెట్లనో తొలగించడం సాధారణంగా చూస్తుంటాం. కాని ఓ ఇంటికి ప్రధాన రహదారికి మధ్యలో అడ్డుగా ఉందని ఏకంగా జీహెచ్ఎంసీ పార్కునే తొలగించాడు ఓ ప్రబుద్ధుడు. స్థానికంగా తీవ్ర చర్చనీయంశంగా మారిన ఈ సంఘటన గచ్చిబౌలి డివిజన్ పరిధిలో చోటు చేసుకుంది.
కంచ గచ్చిబౌలి, నవోదయ కాలనీ, ప్లాట్ నెంబర్ 100 స్థల యజమాని జె.హరి ఇంటి నిర్మాణం కోసం 2020 ఫ్రిబ్రవరిలో జీహెచ్ఎంసీ నుంచి అనుమతి (పర్మిట్ నెం.2/C20/02258/2020) తీసుకున్నాడు. ఐతే టౌన్‌ప్లానింగ్ వారు జారీచేసిన అనుమతులకు విరుద్ధంగా నిర్మాణం చేశాడని విమర్శలున్నాయి. నవోదయ కాలనీ సంక్షేమ సంఘం పెద్దలు సైతం సదరు నిర్మాణం పట్ల గుర్రుగా ఉన్నారు. రోడ్డు స్థలం కలుపుకున్నాడని, సెట్ బ్యాక్స్ వదలలేదని, నిర్మాణ దారుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఐతే అంతటితో ఆగని నిర్మాణదారుడు మరోక అడుగు ముందుకు వేశాడు. తన ఇంటిని ఆనుకుని ఉన్న జీహెచ్ఎంసీ పార్కును స్థలాన్ని కాజేసే ప్రయత్నం చేస్తున్నాడు.
నిజానికి తన 348 చ.మీ స్థలానికి తూర్పు వైపు రోడ్డు చూపిస్తూ అనుమతి పొందాడు నిర్మాణదారుడు. ఐతే పడమర మైపు నల్లగండ్ల నుంచి గోపన్‌పల్లికి వెళ్లే ప్రధాన రహదారికి హరి నివాసానికి మధ్యలో ఒక జీహెచ్ఎంసీ పార్కు ఉంది. ఐతే ఎప్పటికైన పార్కును తొలగించి తన ఇంటిని పడమర అభిముఖంగా మార్చుకోవాలన్నది ఆయన ఆలోచన. ఈ క్రమంలోనే తన భవనానికి పడమర వైపు ఎలివేషన్ ఇచ్చుకున్నాడు. నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ఇటీవల పార్కు గోడలను తొలగించాడు. ఇంటి నుంచి రోడ్ వరకు పార్కు స్థలంలో మట్టిని నింపేసి చదును చేశాడు.
ప్రధాన రహదారికి, పార్కుకు మధ్యలో హైటెన్షన్ విద్యుత్ కేబుల్స్, పలు స్థంభాలు అడ్డుగా ఉన్నయి. ఐతే నిర్మాణదారుడు తదుపరి చర్యగా వాటిని తొగించడమే లక్షంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే విద్యుత్ శాఖా అధికారులతో మాట్లాడుకున్నారని సమాచారం. ఇంటికి అడ్డుగా ఉందని ఏకంగా జీహెచ్ఎంసీ పార్కునే కబ్జా చేస్తున్న ప్రభుద్ధుడిపై జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
కఠిన చర్యలు తీసుకోవాల్సిందే…
మా కాలనీ సభ్యుడు హరి చేసిన పనిని సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పటికే ఇటు రోడ్డు వైపు జరిగి, అటు సెట్ బ్యాక్స్ వదల కుండా నిర్మాణం చేపట్టడాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. పార్కు గోడలను తొలగించడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణంపై కఠిన చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీని డిమాండ్ చేస్తున్నాం.
పోతన ప్రకాష్, అధ్యక్షులు, నవోదయ కాలనీ సంక్షేమ సంఘం.
పోలీసులకు ఫిర్యాదు చేశాం…
కంచ గచ్చిబౌలి, నవోదయ కాలనీ ప్లాట్ నెంబర్ 100 యజమాని జీహెచ్ఎంసీ పార్కు గోడలను కూల్చివేయడం చట్ట విరుద్ధం. ఈ క్రమంలోనే నిర్మాణదారుడు హరిపై చందానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. ఆయన స్వంత ఖర్చులతో తిరిగి గోడ నిర్మించి ఇవ్వాలని సూచించాం.
రమేష్, సెక్షన్ ఆఫీసర్, టౌన్‌ప్లానింగ్.