నమస్తే శేరిలింగంపల్లి: రాయదుర్గం పోలీస్ స్టేషన్ సమీపంలోని బావర్చి హోటల్ భవనం రెండవ అంతస్థులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా దట్టమైన పొగలతో కూడుకున్న మంటలు చెలరేగడంతో సదరు భవనంలో పనిచేస్తున్న సిబ్బంది, కస్టమర్లు బయటకు పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చి వారి సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.

పగటి పూట అగ్ని ప్రమాదం జరగడంతో అప్రమత్తమైన సిబ్బంది, కస్టమర్లు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు పెట్టడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా 14 మంది గాయాలయినట్టు సమాచారం. వారిని సమీప హాస్పిటల్స్‌లో చికిత్స అందిస్తున్నారు. అగ్నిప్రమాదం నేపథ్యంలో రెండవ అంతస్థులోని సెక్యూరిటీ ఫోర్సుకు సంబంధించిన పలు వస్తువులు దగ్దమవడంతో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం ఎలా జరిగిందనే కారణాలు ఇంకా తెలియరాలేదు. బావర్చిహోటల్ భవనంలో అగ్నిప్రమాదం జరగడంతో ప్రధాన రహదారిపై వాహనరాకపోకలకు అంతరాయం ఏర్పడి భారీగా ట్రాఫిమ్ జామ్ ఏర్పడింది.

