- ఇంటింటి ప్రచారంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సతీమణి శ్యామల దేవి
నమస్తే శేరిలింగంపల్లి : కారు గుర్తుకు ఓటేసి.. బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సతీమణి శ్యామల దేవి అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీనగర్, సీబీఆర్ ఎస్టేట్స్, అట్లాంటిక్ సిటీ, ఆదర్శ్ నగర్, శాంతి నగర్ కాలనీలలో కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామల దేవి మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే వచ్చే ఐదేండ్ల కాలంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి మరింత మెరుగుపడుతుందని తెలిపారు.
కేసీఆర్ బీమా పేరుతో కొత్త స్కీమ్ అమలు చేసి ప్రజలందరికీ రూ.5 లక్షల చొప్పున కేసీఆర్ బీమా, తెల్ల రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం, ఆసరా పింఛన్ కు దశల వారీగా నెలకు రూ.5 వేలకు పెంపు వంటి పలు కీలక హామీలు ప్రకటించిన సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామ రక్ష అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది ఏండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతున్నట్లు చెప్పారు. చందానగర్ డివిజన్, దీప్తి శ్రీ నగర్ కాలనీ అభివృద్ధికి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఎనలేని కృషి చేశారని, వరద ముంపు కు విముక్తి కలిపించారని పేర్కొన్నారు.
రాబోయే ఎన్నికల్లో విజయం తధ్యం అని, బీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వరలక్ష్మి, చంద్రిక ప్రసాద్, మాధవి, పృథ్వి, రాధిక, ప్రణీత, కుమార్, సునీత, మీనా , హరిత, రాజేశ్వరి, యుగంధర్, రజిని, శ్యామల, కాలనీ వాసులు పాల్గొన్నారు.