నమస్తే శేరిలింగంపల్లి : నిత్యం పెరుగుతున్న ట్రాఫిక్ నేపథ్యంలో రహదారుల విస్తరణను ప్రాధాన్యతగా చేపడుతున్నట్లు జోనల్ కమీషనర్ ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందుకోసం ఆస్తుల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయటంతోపాటు విస్తరణకు ఆటంకంగా ఉన్న విద్యుత్ స్తంభాలను పక్కకు మార్చాలన్నారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలో జడ్సీ ఉపేందర్‌రెడ్డి శనివారం పర్యటించి మల్కం చెరువు, ఖాజాగూడ, గచ్చిబౌలి, క్యూ మార్ట్ జంక్షన్‌లను పరిశీలించారు.
ఫ్రీలెఫ్ట్‍లతో పాటు రహదారులను విస్తరించాల్సిన ప్రాంతాలను అధికారులతో కలిసి చూసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జోన్‌లోని శేరిలింగంపల్లి , చందానగర్ సర్కిళ్ల పరిధిలో పలు ప్రాంతాలలో రహదారుల విస్తరణను ప్రాధాన్యతగా చేపడుతున్నట్లు తగు ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామన్నారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ స్తంబాలు రహదారుపైకి ఉన్నందున వాటిని తగు జాగ్రత్తలతో పక్కకు మార్చాలని జడ్సీ ఉపేందర్‌రెడ్డి తెలిపారు. పట్టణ ప్రణాళిక , ఎలక్టికల్ విభాగాలు సమన్వయంతో పని చేయాలన్నారు. రహదారుల విస్తరణ సందర్భంగా ఒక్క చెట్టును కూడా కొట్టవద్దని, సురక్షిత పద్ధతిలో ఇతర ప్రాంతాలకు తరలించి నాటాలన్నారు. ప్రధాన రహదారుల వెంట గోడలపై అందమైన ఆలోచింపచేసే చక్కని చిత్రాలను గీయించాలని, అందుకు అనువైన ప్రాంతాలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని జడ్సీ ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు.
ప్రతి కూడలి పరిశుభ్రంగా పచ్చదనంతో ఉండాలని అధికారులు తగు కృషి చేయాలన్నారు. పరిశుభ్రత నిర్వహణను అత్యంత ప్రధానంగా చేపట్టాలని ,చెత్త వ్యర్థాలను ఎప్పటికపుడు తరలించాలని జడ్సీ ఉపేందర్‌రెడ్డి ఆదేశించారు. ఆయనతొ పాటు పలు విభాగాల అధికారులున్నారు.