నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ లో సంక్షేమ పథకాల కోసం ఏర్పాటుచేసిన దరఖాస్తు కేంద్రాలను శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు. ఆయా కేంద్రాలలో అర్హులైన వారందరు తమ దరఖాస్తులు ఇవ్వాలని ఆయన తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో భాగంగా, ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని, సంబంధిత అధికారులకు నాగేందర్ యాదవ్ ఆదేశించారు. జనవరి 6వ తేదీ వరకు డివిజన్ లో ఏర్పాటుచేసిన కేంద్రాలలో ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలను సంబందించిన అన్ని రకాల ఫారాలు అందుబాటులో ఉంచి, వాటికీ సంబందించిన అధికారులు తమ సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారని, ప్రజలందరూ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ ప్రజాపాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతుభరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ది కోసం అర్హులైన వారు అప్లై చేసుకోవచ్చని అన్నారు. దరఖాస్తు చేసుకునుటకు కావలసిన పత్రాలు 1. ఆధార్ కార్డ్ జిరాక్స్ 2. తెల్ల రాషన్ కార్డు జిరాక్స్ 3. ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫోటో. ముఖ్యగమనిక అప్లికేషన్ ఫారం తప్పులు లేకుండా పూర్తి చేయాలన్నారు.
కార్పొరేటర్ మాట్లాడుతూ.. అప్లికేషన్ ఫార్మ్స్ అధికారులే ఉచితంగా అందచేస్తారని, ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వొదని హెచ్చరించారు. కరోనా విస్తరణ నేపథ్యంలో ప్రతిఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించి రావాలని, శానిటైజర్ వాడుతూ, భౌతిక దూరం పాటిస్తూ ఉండాలని, కోవిడ్ నిబంధనలకు లోబడి కార్యక్రమం జరుగుంతుందని తెలిపారు.