శేరిలింగంపల్లి రాజకీయాల్లోకి సీనియర్ జర్నలిస్టు..!

  • కార్పొరేటర్ బరిలో కొండా విజయ్ కుమార్..?
  • హోప్ ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవతో ప్రజల్లోకి
  • అధికార పార్టీ పెద్దలతో సాన్నిహిత్యం
  • మూడు డివిజన్లలో ఒక ప్రాంతం నుండి పోటీకి యోచన.

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: గ‌్రేట‌ర్ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ ప‌డుతున్న వేళ శేరిలింగంప‌ల్లిలో రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. అధికార టిఆర్ఎస్ పార్టీలో రాజ‌కీయాలు కొత్త‌ మ‌లుపులు తిరుగుతున్నాయి. ఒక‌వైపు సిట్టింగులకే తిరిగి అవ‌కాశాలంటూ బలమైన ప్రచారం జ‌రుగుతుండ‌గా మ‌రోవైపు ప్రతీ డివిజ‌న్‌లోనూ ఆశావాహుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతుండటం గమనార్హం. ఇదే క్ర‌మంలో శేరిలింగంప‌ల్లికి చెందిన ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు సైతం తాజాగా రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం చేయనున్నట్లు స్ప‌ష్టమ‌వుతుంది. అనూహ్యంగా తెర‌పైకి వ‌చ్చి అధికార పార్టీతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న సదరు జర్నలిస్టు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నడు.

కొండా విజ‌య్‌కుమార్

రంగారెడ్డి జిల్లా షాబాద్‌ ప్రాంతానికి చెందిన కొండా విజ‌య్‌కుమార్ రెండున్న‌ర‌ ద‌శాబ్ధాల క్రితం శేరిలింగంప‌ల్లికి వ‌చ్చి స్థిర‌ప‌డ్డాడు. ఓ ప్ర‌ధాన ప‌త్రిక‌లో స్థానిక రిపోర్ట‌ర్‌గా త‌న జ‌ర్న‌లిజం జీవితాన్ని ప్రారంభించిన విజ‌య్‌కుమార్ అంచెలంచెలుగా ఎదిగి అదే రంగంలో నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీ స్థాయికి చేరుకున్నాడు. తెలంగాణ మ‌లిద‌శ ఉద్య‌మ సమయంలో జ‌ర్న‌లిస్టు, ఉద్యోగ సంఘాల, రాజకీయ పార్టీల నేతల మ‌ద్ధ‌తుతో శేరిలింగంప‌ల్లి పొలిటిక‌ల్ జేఏసీ క‌న్వీన‌ర్‌ పదవిని చేపట్టాడు. ఆ క్ర‌మంలోనే ఇప్ప‌టి రాష్ట్ర మంత్రి, అప్ప‌టి జేఏసీ రాష్ట్ర కో చైర్మ‌న్ వి.శ్రీనివాస్‌గౌడ్‌కు ద‌గ్గ‌ర‌య్యాడు. సామాజిక సేవతో పేదవారికి చేయూతనిచ్చేందుకు హోప్ ఫౌండేష‌న్ పేరిట స్వ‌చ్ఛంద సేవా సంస్థ‌ను స్థాపించడంతో పాటు లయన్స్ క్లబ్ లో చేరి విరివిగా సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నాడు. ఎటువంటి విరాళాలు  సేకరించకుండా సొంతఖర్చులతో పేదలకు ఆర్థికంగా అండగా ఉంటూ అన‌తి కాలంలోనే శేరిలింగంప‌ల్లి నియోజక‌వ‌‌ర్గంలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు.

ప్ర‌భుత్వ విప్, స్థానిక శాస‌న‌స‌భ్యులు ఆరెక‌పూడి గాంధీతో మొద‌టి నుంచి స‌న్నిహితంగా ఉంటూ వ‌స్తున్న విజ‌య్‌కుమార్ గ‌త కొంత కాలంగా ప్ర‌తిరోజు ఆయ‌న‌ చేతుల మీదుగా ర‌క‌ర‌కాల సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ ప‌రిణామాల‌న్నింటి నేప‌థ్యంలో కొండాకు కార్పొరేట‌ర్ అభ్య‌ర్థిగా అవకాశం ఇచ్చే యోచనలో విప్ గాంధీ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కాగా కొండా విజయ్ రానున్న ఎన్నిక‌ల్లో పోటి చేసేందుకు మూడు డివిజ‌న్ల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గచ్చిబౌలి ఆశావహుల‌తో స్థానిక టీఆర్ఎస్ పెద్ద‌లు నిర్వహించిన అంత‌ర్గ‌త స‌మావేశంలో కొండా విజ‌య్ హాజరవడం చర్చకు దారితీసింది. త్వరలో జరుగనున్న శేరిలింగంపల్లి ఆశావహుల సమావేశానికి సైతం కొండా విజయ్ కు ఆహ్వానం అందినట్లు సమాచారం. ఐతే గ‌చ్చిబౌలి, శేరిలింగంప‌ల్లిలతో పాటు కొండాపూర్ డివిజ‌న్‌లో త‌న‌కు మంచి ప‌ట్టు ఉంద‌ని, ఆ మూడింటిలో ఏ ఒక్క డివిజ‌న్ నుంచి అవ‌కాశం క‌ల్పించినా త‌న స‌త్తా నిరుపించుకోగ‌‌ల‌నని ప్ర‌భుత్వ విప్ గాంధీ దృష్టికి తీసుకెళ్లిన‌ట్టు తెలుస్తోంది.

ప్రభుత్వ విప్ అరికెపుడి గాంధీ తో కొండా విజయ్ కుమార్

కొండా విజ‌య్‌కుమార్ ఆశిస్తున్న మూడు డివిజ‌న్ల‌లో ఇప్ప‌టికే అధికార పార్టీకి చెందిన కార్పొరేట‌ర్లు కొనసాగుతున్నారు. దానికి తోడు పలువురు సీనియ‌ర్ నాయ‌కులు సైతం టిక్కెట్ రేసులో ఉన్నారు. కొండా విజ‌య్‌ సామాజిక సేవా కార్య‌క్ర‌మాల జోరు పెంచ‌డం, గ‌త రెండు నెల‌లుగా నియోజ‌క‌వ‌ర్గ బాస్‌తో అత్యంత‌ స‌న్నిహితంగా మెదులుతున్న తీరు ఇత‌ర ఆశావాహుల‌కు మింగుడు ప‌డ‌టం లేదు. ఏళ్ల త‌ర‌బ‌డి పార్టీలో కొన‌సాగుతున్న త‌మ స్థానాల‌ను దాటి కొండా విజ‌య్‌కుమార్ అనూహ్యంగా ముందు వ‌ర‌స‌లోకి రావడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. పార్టీ కండువా కప్పుకోకుండానే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తూ దూకుడుగా వ్యవహరిస్తున్నాడంటూ కొండా వ్యవహార శైలిపై పలువురు నాయకులు పెదవి విరుస్తున్నారు. కొత్త‌వారికి టిక్కెట్లు వ‌స్తాయో లేదో చెప్పలేని పరిస్థితుల్లో తోటి ఆశావాహుల్లో మాత్రం కొండా విజ‌య్‌కుమార్ గుబులు పుట్టిస్తున్నాడ‌న‌టంలో అతిశ‌యోక్తి లేదు. ఎన్నికల సమరానికి పార్టీ పెద్దల అనుగ్రహం పొంది బరిలో నిలుస్తాడా, మరేదైనా వ్యూహంతో ముందుకు వెళ్తాడో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here