చందానగర్: కాలనీ ప్రజల భద్రత కొరకు సంక్షేమ సంఘాలు చొరవ చూపాలని చందానగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ రవీందర్ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోనే సత్య ఎనక్లేవ్ కాలనీ వాసులు 2.5 లక్షల రూపాయలతో స్వచ్చందంగా ఏర్పాటు చేసుకున్న సి.సి కెమెరాలను సిఐ రవీందర్ స్థానిక కార్పొరేటర్ నవతరెడ్డి తో కలిసి ప్రారంభించారు. సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చిన కాలనీవాసులకు వారు అభినందనలు తెలిపారు. అనంతరం సిఐ రవీందర్ మాట్లాడుతూ ప్రతీ కాలనీలో సంక్షేమ సంఘాల నాయకులు సిసి కెమెరాలను ఏర్పాటు చేసి స్థానిక ప్రజలకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సిసి కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు నిత్యం వాటిని పర్యవేక్షించాలన్నారు. ఎటువంటి భద్రత పరమైన సమస్యలు ఎదురైనా వెంటనే తమకు సమాచారం అందించాలని, ప్రజల రక్షణ కోసం తాము ఎల్లప్పుడూ సంసిద్దంగా ఉంటామని తెలిపారు. నవతరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలతో ప్రజలు మమేకమై పనిచేసినప్పుడే సమస్యలు పరిష్కారమై అభివృద్ధి సజావుగా సాగుతుందన్నారు. కాలనీలో ఎటువంటి సమస్యలు తలెత్తినా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సత్య ఎన్ క్లేవ్ సంక్షేమ సంఘం నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.