ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమంలా స్వచ్ఛదనం పచ్చదనం

  • రేపటి నుంచి జోన్‌లో ప్రత్యేక కార్యక్రమాలు
  • శేరిలింగంపల్లి జోనల్‌ కమీషనర్‌ ఉపేందర్‌రెడ్డి ఆదేశం

నమస్తే శేరిలింగంపల్లి: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జోన్‌ వ్యాప్తంగా స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని శేరిలింగంపల్లి జోనల్‌ కమీషనర్‌ ఉపేందర్‌రెడ్డి ఆదేశించారు.

ప్రజల భాగస్వామ్యంతోనే సత్ఫలితాలు వస్తాయని ఈ మేరకు ఆ దిశగా ప్రతీ వీధిలో రహదారిలో స్వచ్ఛ పరిసరాలతో పాటు ఆహ్లాదం కలిగించేలా పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో కృషి చేయాలన్నారు. స్వచ్ఛదనం -పచ్చదనం కార్యక్రమంపై జోన్‌ స్థాయిలో డీసీలు, ఇంజినీరింగ్‌, పారిశుద్ధ్య, ఎంటమాలజీ, పొదుపు మహిళా విభాగాలతో జడ్సీ ఉపేందర్‌రెడ్డి శనివారం తన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, ప్రజలందరి భాగస్వామ్యంతో ఉద్యమంలా చేపట్టాలని సత్ఫలితాలతో చక్కని పరిసరాలను తీర్చిదిద్దుకోవాలన్నారు.

తగు ప్రణాళికలను రూపొందించుకుని అన్ని సర్కిళ్లలో అత్యంత పటిష్టంగా అమలు చేయాలని వీధులను శుభ్రం చేయటం, నాలాలు డైన్లలో వ్యర్థాలను తొలగించటం, నివాస ఆవాసాల ఆవరణలలో మొక్కలు నాటి వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని జడ్సీ సూచించారు. 5వ తేదీన జన సమ్మర్థ ప్రాంతాలు, ప్రధాన రహదారులు, పార్కులు , బస్టాండ్‌లు, మార్కెట్‌ ప్రాంతాలలో ప్రత్యేక పారిశుద్ద్య చర్యలు, వ్యర్థాలు, నిర్మాణ వ్యర్థాల తొలగింపును చేపట్టాలన్నారు. 6వ తేదీన దోమల నివారణ కోసం ఫాగింగ్‌, నీరు నిల్వ ప్రాంతాలలో నివారణ చర్యలు, బస్తీలు బస్తీ దవాఖానలలో డెంగ్యూ పాజిటివ్‌ కేసుల గుర్తింపు, వీధి శునకాలకు స్టెరిలైజేషన్‌ను నిర్వహించాలని జడ్సీ ఆదేశించారు. 7వ తేదీన చెరువుల పరిరక్షణ చర్యలు, వాటి పరిసరాలలో ఉన్న నిర్మాణ, ఇతర వ్యర్థాల తొలగింపు, ఆక్రమణల గుర్తింపు చేపట్టాలన్నారు. 8 వ తేదీన రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లు, స్వయం సహాయక బృందాలు, బస్తీ కమిటీలతో సమావేశాలు నిర్వహించి ప్రజారోగ్యంపై అవగాహన కల్పించాలని, నాలాల్లో పేరుకున్న వ్యర్థాల తొలగింపు, రహదారులపై నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఖాళీ స్థలాలు నివాస ఆవాసాలలో విరివిగా మొక్కలు నాటించే కార్యక్రమం చేపట్టాలని, వాటి పరిరక్షణకు చర్యలు తీసుకునేలా అవగాహన కల్పించాలని జడ్సీ ఉపేందర్‌రెడ్డి స్పష్టం చేసారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతంగా సమర్థంగా నిర్వహించాలని, మెరుగైన పరిసరాల కోసం కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీలు సహా ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here