నమస్తే శేరిలింగంపల్లి: హిందూ దేవీ దేవతలను అవమానించే వారిపై పీడీ యాక్టులు పెట్టి కఠినంగా శిక్షించాలని బిజెపి రాష్ట్ర నేత కసిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. చందానగర్ లో వి.హెచ్.పి. ఆద్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్టంలో హిందూ మతం, దేవుళ్లపై ఓవైపు అవహేళన, అసభ్యపదజాలాలతో దాడులు జరుగుతుంటే రాష్ట్ర యంత్రాంగం నిమ్మకునీరెత్తినట్టు ఊరుకొని అయ్యప్పలు, హిందూ సమాజం రోడ్లమీదకొచ్చాక కేసులు, జైలుల పేరిట నాటకాలాడుతున్నాయని, భవిష్యత్తులో ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.
దేవుళ్లను దూషించిన భేరి నరేష్ పై పీడీ యాక్టు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పాలన హిందువులపట్ల వివక్షతో కూడుకొని ఉందని, అసాంఘిక శక్తులకు ఆశ్రయం కల్పిస్తూ, వివక్ష చూపుతున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వి.హెచ్.పి.జిల్లా ఉపాద్యక్షుడు బండారి కృష్ణ, బాలాజీ, నూనె సురేందర్, విజయకుమార్ రెడ్డి, శివసేన నాయకులు బెజగం కేశవులు, పగడాల వేణుగోపాల్, రవీందర్ రెడ్డి, ప్రభాకర్, శ్రీనివాస్ రెడ్డి, ప్రశాంత్ చారి, హరి, ఠాగూర్ పాల్గొన్నారు.