- అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య రాజుకున్న వివాదం
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం అధికార టిఆర్ఎస్, ప్రతిపక్ష బిజెపి పార్టీ నాయకుల మద్య వివాదానికి కారణమయ్యింది. సోమవారం కొత్తగూడ కమ్యూనిటీ హాలులో నిర్వహించిన కొత్తరేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గాంధీ టిఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధరరెడ్డికి సమాచారం అందించకపోవడంతో ఆయన పార్టీ నాయకులతో కలిసి కార్యక్రమం జరిగే ప్రదేశానికి చేరుకుని టిఆర్ఎస్ నాయకులతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వం అధికారికంగా జరిపే కార్యక్రమంలో ప్రొటోకాల్ విడిచిపెట్టి కేవలం టిఆర్ఎస్ పార్టీ నాయకులతో ఎలా జరుపుతారని బిజెపి నాయకులు ప్రశ్నించారు. బిజెపి కార్పొరేటర్‌కు సమాచారం ఇవ్వకపోవడంపై ఎఎస్ఒపై ఫైర్ అయ్యారు. బిజెపి నాయకులు కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని బిజెపి నాయకులను సముదాయించడంతో వివాదం సద్దుమణిగింది.
ఆందోళన చేపట్టిన వారిలో బిజెపి నాయకులు గంగల రాధాకృష్ణయాదవ్, రంగారెడ్డి అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు పోరెడ్డి బుచ్చిరెడ్డి, రాష్ట్ర ఎస్సీమోర్చ ఐటి సెల్ అధ్యక్షులు రాహుల్, జిల్లా అధ్యక్షులు నరేంద్ర ముదిరాజ్, కార్యదర్శి మూల అనిల్‌గౌడ్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చ అధ్యక్షుడు హనుమంత్‌నాయక్, శేరిలింగంపల్లి మహిళా మోర్చ కన్వీనర్ పద్మలతో పాటు బిజెపి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.