శేరిలింగంపల్లి, ఏప్రిల్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): క్రికెట్ ఆడి వస్తానని ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ బాలుడు అదృశ్యమైన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గండిపేటలోని మణికొండలో నివాసం ఉంటున్న కురువ మల్లేష్ స్థానికంగా వాచ్ మన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని కుమారుడు కె.శ్రీకాంత్ (15) ఈ నెల 19వ తేదీన క్రికెట్ ఆడడానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అనంతరం తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు చుట్టు పక్కల, బంధువులు, స్నేహితులు, తెలిసిన వారి వద్ద శ్రీకాంత్ ఆచూకీ కోసం ఆరా తీశారు. అయినప్పటికీ అతని ఆచూకీ తెలియలేదు. దీంతో అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా శ్రీకాంత్ అదృశ్యం అవడానికి ముందు రోజు ఈ నెల 18న ట్యూషన్‌కు వెళ్లకపోవడంతో తండ్రి మందలించాడని తెలిసింది. ఆ కారణంతోనే మనస్థాపానికి గురైన శ్రీకాంత్ ఇంటి నుంచి బయటకు వెళ్లి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు శ్రీకాంత్ ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






