శేరిలింగంపల్లి, ఏప్రిల్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయడంతోపాటు ప్రజలకు కావల్సిన మౌలిక సదుపాయాలను మెరుగు పరచాలని కోరుతూ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి. సృజనని నగర పాలక సంస్థ కార్యాలయంలో శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేరిలింగంపల్లి డివిజన్ లో నూతనంగా నిర్మాణం చేపట్టబోయే ప్లైఓవర్ అభివృద్ధి వలన రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని అన్నారు. కానీ ఈ ప్రాంతంలో గత 30 ఏళ్లుగా నివసిస్తున్న పేద కుటుంబాలకు చెందినవారు ఉన్నందున వారిని దృష్టిలో పెట్టుకుని ప్లైఓవర్ పనులను 30 మీటర్ల వరకు మాత్రమే కుదించి భూసేకరణ చేపట్టి ఫ్లైఓవర్ నిర్మాణం ఏర్పాటు చేసి సౌకర్యవంతమైన రవాణా సౌకర్యాన్ని కల్పించాలని అన్నారు. అలాగే తారానగర్ మార్కెట్ మెయిన్ రోడ్డును 80 ఫీట్ లకు కుదించి మెయిన్ రోడ్డును అభివృద్ధి పరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సోమదాస్, సీనియర్ నాయకులు మిరియాల రాఘవరావు, జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.






