మియాపూర్ ట్రాఫిక్ , చందానగర్ పీఎస్ లలో మాజీ కార్పొరేటర్, బిజెపి జిల్లా కార్యదర్శి బొబ్బ నవత రెడ్డి ఫిర్యాదు
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ట్రాఫిక్ నిబంధనలు ప్రజలకేనా.. ప్రజాప్రతినిధులకు వర్తించవా అంటూ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతరెడ్డి ప్రశ్నించారు. కనీసం తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్లు లేకుండా గత 2- 3 సంవత్సరాల నుండి కార్లలో ప్రయాణిస్తున్న ప్రజాప్రతినిదులపై మియాపూర్ ట్రాఫిక్ , చందానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా మాజీ కార్పొరేటర్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ట్రాఫిక్ ను సరి చేయవలసిన ట్రాఫిక్ పోలీసులు కేవలం కెమెరాలు పట్టుకొని ప్రజల మీద విచ్చలవిడిగా ట్రాఫిక్ చల్లాన్లు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల వాహనాలను ఫోటోలు తీయటానికి పరిమితం అవుతున్నారన్నారు. సమస్యను పరిష్కరించి ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు వారి కార్లకే రిజిస్ట్రేషన్ నంబర్లు లేకుండా గత 2- 3 సంవత్సరాలుగా తిరుగుతున్నరని, ట్రాఫిక్ రూల్స్ వారికి వర్తించావా? ట్రాఫిక్ పోలీసులు వారి పై చట్ట ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులకు ఒక న్యాయం.. ప్రజలకు ఒక న్యాయమా.. ప్రజాప్రతినిధుల కార్లపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని, లేకుంటే అధికారుల దృష్టికి, కోర్ట్ దృష్టికి తీసుకువెళ్తామని డిమాండ్ చేశారు.