నమస్తే శేరిలింగంపల్లి: కోవిడ్ నేపథ్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని రైతులు రైతుబంధు నగదు ఉపసంహరించుకునేందుకు భారత పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో మరోసారి మైక్రో ఏటియం సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు హైదరాబాద్ రీజియన్ పోస్టల్ కార్యాలయ డైరక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన నేపథ్యంలో బ్యాంకుల్లో పెరగే రద్దీని దృష్టిలో ఉంచుకుని గత సీజన్‌లో మాదిరిగానే మైక్రో ఏటియం సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. 2020-21 రబీ సీజన్‌లో పోస్టల్ మైక్రో ఏటియంల ద్వారా రూ. 169 కోట్లను 1.73 లక్షల మంది రైతులకు అందజేసినట్లు తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5794 పోస్టాఫీసులలో మైక్రో ఏటియం సేవలు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సేవలను వినియోగించదలచిన రైతులు మొబైల్ నెంబరు అనుసంధానించబడిన ఖాతా కలిగిన ఫోన్, ఆధార్ కార్డు తీసుకువెళ్లి వేలిముద్ర ద్వారా నగదు ఉపసంహరించుకోవచ్చని తెలిపారు. రోజుకు గరిష్టంగా రూ.10 వేలు ఖాతా నుండి తీసుకోవచ్చని, ఈ సేవలు పూర్తి ఉచితంగా అందించనున్నట్లు పోస్టల్ అధికారులు తెలిపారు.