- ఇజ్జత్‌నగర్ శ్మశాన వాటిక స్థలం వేలంపాటపై మండిపడ్డ గంగల రాధకృష్ణ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఇజ్జత్‌నగర్ వీకర్ సెక్షన్ శ్మశానవేలం వాటికను బిజెపి డివిజన్ ఇన్చార్జీ గంగల రాధకృష్ణ యాదవ్ శుక్రవారం పరిశీలించారు. సదరు స్థలాన్ని ప్రభుత్వం వేలం వేసేందుకు నిర్ణయించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అనంతరం డిప్యూటీ కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్ వంశీమోహన్‌ను కలిసి వినతీ పత్రం అందజేశారు. ఖానమెట్ గ్రామ సర్వే నెంబర్ 41/14 లోని ఇజ్జత్‌నగర్ శ్మశాన వాటిక స్థలాన్ని టీఎస్ఐఐసీ ప్లాట్ నెంబర్ 17గా పేర్కొని, వేళం వేస్తున్నట్టు బోర్డును ఏర్పాటు చేయడం ఏంటని రాధకృష్ణ యాదవ్ ప్రశ్నించారు. ఖానామెట్ ఇజ్జత్‌నగర్ పరిసర ప్రాంతాల్లో 10 వేలకు పైగా జనాభ నివాసం ఉంటుందని, బీసీ, ఎస్‌సీ, ఎస్టీలు ఎవరు మృతిచెందినా గత రెండు దశాబ్ధాలుగా ఇదే స్థలంలో అంత్య క్రియలు చేపడుతున్నారని అన్నారు.

ఇలాంటి శ్మశాన వాటిక స్థలాన్ని, ఇప్పటికే వందల సంఖ్యలో సమాధులున్న ప్రాంతాన్ని అమ్ముకోవడం సిగ్గుచేటని అన్నారు. ఎన్నో ఏళ్లుగా స్థానిక హిందువులు అంత్యక్రియలు చేసుకుంటు వస్తున్న దాదాపు నాలుగు ఎకరాల స్థలాన్ని భేషరతుగా వదిలేసి మిగిలిన భూములను వేలం వేసుకోవాలని సూచించారు. ఇదే ప్రాంతంలో ఎకరాల కొద్ది ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమణదారులు కబ్జా చేస్తుంటే పట్టించుకోని కేసీఆర్ ప్రభుత్వం, నిరుపేదల మరుభూమిపై కన్నెశారని మండిపడ్డారు. ప్రభత్వం వెంటనే దిగొచ్చి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేనియెడల స్థానికులకు అండగా భారతీయ జనతాపార్టీ ఉద్యమం కొనసాగిస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
