- రాజస్థాన్ లో శ్రీ ఓం బన్నాజీ (బుల్లెట్ బాబా) దేవాలయం
మనం దేశంలో ఎన్నో రకాల గుడులు, దేవాలయాలను మనం నిత్యం చూస్తూనే ఉంటాం. కొన్ని విశేషాలు గల దేవాలయాల గురించి అప్పుడప్పుడు వార్తల్లో వింటుంటాం. ఈ మధ్య కాలంలో కొందరు తమ అభిమాన రాజకీయ నాయకులకు గుడులు కట్టి పూజించడం వింటున్నాం. కానీ ఒక బైక్ కు గుడి కట్టి నిత్యం పూజలు చేయడం గురించి ఎప్పుడైనా విన్నారా..? రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఉంది ఈ దేవాలయం . ఆ గుడి విశేషాలు ఏంటో తెలుసుకుందామా..!

రాజస్తాన్ లోని ప్రధాన నగరమైన జోధ్ పూర్ లోని పాలి జిల్లాకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గుడి. 1988 డిసెంబర్ 2 వ తేదీన రాజ్ పుత్ వంశానికి చెందిన ఓం సింగ్ రాథోడ్ (ఓం బన్నా) అనే యువకుడు బాంగ్డి నుండి చోటిలా ప్రాంతానికి తన ద్విచక్ర వాహనం రాయల్ ఎన్ ఫీల్డ్ (RNJ 7773 ) పై వెళ్తుండగా బైకు అదుపుతప్పి పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓం సింగ్ రాథోడ్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైకు పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. ఘటన జరిగిన తెల్లవారు ఝామున పోలీసులు బుల్లెట్ ను పోలీసు స్టేషన్ కు తరలించారు. తర్వాతి రోజున ఆశ్చర్యకరంగా బైక్ స్టేషన్ నుండి కనిపించకుండా పోయి ప్రమాద ఘటన స్థలం లో ప్రత్యక్షమైంది. మరోసారి పోలీసులు బైకును పోలీసు స్టేషన్ కు తరలించి పెట్రోలు మొత్తం ఖాళీ చేసి లాక్ చేశారు. మరోసారి బైకు స్టేషన్ నుండి మాయమై ఘటన స్థలంలో ప్రత్యక్షమైంది. ప్రతీసారి ఇలాగె జరగడంతో బైకుకు అతీత శక్తులు ఉన్నాయని భావించిన స్థానికులు గుడికట్టి పూజించడం మొదలు పెట్టారు. దీంతో పాటు ఓం బన్నా జీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి నిత్యం పూజిస్తున్నారు.

ఓం బన్నా జీ బుల్లెట్ బాబా టెంపుల్ గా ప్రసిద్ధి చెందిన ఈ గుడిలో స్థానిక ప్రజలు, ఈ ప్రాంతానికి వచ్చే యాత్రికులు పూజలు చేయడం సంప్రదాయంగా మారిపోయింది. వాహనదారులను ఓం బన్నా ఆత్మా కాపాడుతూ ఉంటుందనేది ఇక్కడి ప్రజల విశ్వాసం. ఎవరైతే ఇక్కడికి వచ్చి పూజలు చేయరో వారి ప్రయాణం ప్రమాదంలో పడుతుందని స్థానికులు భావిస్తూ ఉంటారు. ఓం బన్నా దేవాలయంలో పువ్వులు, కొబ్బరి కాయలు, స్వీట్లతో పాటు మద్యం నైవేద్యంగా సమర్పించడం విశేషం. గుడి ముందు ఎల్లప్పుడూ జ్వాల వెలుగుతూ ఉంటుంది.






