శేరిలింగంపల్లి, ఆగస్టు 17 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) పరిధిలోని SLPZ, మియాపూర్ సర్కిల్-48లో ఫారం-5 ముసాయిదా ప్రచురణ ప్రక్రియ పూర్తయింది. ముసాయిదా జాబితాలోని వివరాలపై ఓటర్లు తమ క్లెయిమ్‌లు, అభ్యంతరాలను నిర్ణీత గడువులోగా సమర్పించవచ్చని అధికారులు తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేరు, ఇతర ఎన్నికల వివరాలను ఓటర్లు క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని సూచించారు. వివరాల్లో ఏవైనా తప్పులు, అభ్యంతరాలు ఉంటే వాటికి సంబంధించిన అవసరమైన ఆధార పత్రాలతో సంబంధిత అధికారులకు నిర్ణీత సమయంలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ముసాయిదా జాబితాలో తమ ఎన్నికల వివరాలు సరిగ్గా నమోదయ్యాయో లేదో నిర్ధారించుకోవాలని అధికారులు కోరారు.






