సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 18 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ జీవిత చరిత్ర, బహుజన సమాజం కోసం ఆయన చేసిన పోరాటాలను స్మరించుకున్నారు. భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రస్తుత జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ గ్రామంలో జన్మించారని తెలిపారు. ఆయన తండ్రి నాసగోని ధర్మన్న గౌడ్ అని, స్థానికులు గౌరవంతో ధర్మన్నదొర అని పిలిచేవారని పేర్కొన్నారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన పాపన్న గౌడ్‌ను తల్లి సర్వమ్మ పెంచారని తెలిపారు.

తల్లి కోరిక మేరకు పాపన్న గౌడ్ గౌడ వృత్తిని స్వీకరించారని, ఎల్లమ్మకు పరమ భక్తుడిగా ఉండటంతో పాటు శివుడిని కూడా ఆరాధించేవారని రామచందర్ యాదవ్ తెలిపారు. బహుజనుల కోసం పోరాడిన ఆయనను బహుజన వీరుడు, బహుజన నాయకుడు, బహుజన చక్రవర్తిగా ప్రజలు గౌరవించారని అన్నారు. తెలంగాణలో మొగల్, తురుష్కుల పాలనకు వ్యతిరేకంగా పాపన్న గౌడ్ పోరాటం సాగించారని పేర్కొన్నారు. చిన్నచిన్న ప్రాంతాలను తన ఆధీనంలోకి తీసుకుంటూ సామ్రాజ్యాన్ని విస్తరించారని, గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని విజయదుర్గాలను నిర్మించారని తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ సమకాలికుడైన పాపన్న గౌడ్‌ను తొలి బహుజన చక్రవర్తిగా పేర్కొంటారని అన్నారు. బహుజనుల హక్కులు, సామాజిక న్యాయం కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని భేరి రామచందర్ యాదవ్ అన్నారు.

ఈ కార్యక్రమంలో రాధాకృష్ణ చారి, భాను ప్రకాష్ చారి, శ్రవణ్ చారి, సిరిపురం హరికృష్ణ చారి, కృష్ణ గౌడ్, అశోక్ ముదిరాజ్, కిరణ్ పద్మశాలి, రజక సంఘం కిరణ్, నాయి బ్రాహ్మణ సంఘం సాయిలు, వడ్డెర సంఘం కిరణ్, మేదరి మహేంద్ర సంఘం సుమన్‌తో పాటు పలువురు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here