మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని లైఫ్‌స్టైల్ స్టోర్ ఉద్యోగిని మృతి

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 18 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆగస్టు 16న మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఇనార్బిట్ మాల్‌లోని లైఫ్‌స్టైల్ స్టోర్‌లో పనిచేస్తున్న భారతి ముఖి (26), పూజా అశోక్ అలోన్ (26) భోజనం తీసుకురావడానికి ఐటీసీ కోహెనూర్ సమీపానికి వెళ్లారు. భోజనం తీసుకుని తిరిగి ఇనార్బిట్ మాల్ వైపు వస్తుండగా మాల్ ఎదురుగా రోడ్డు దాటుతున్న సమయంలో TG09G0666 నంబర్ గల కారు భారతి ముఖిని ఢీకొట్టింది. కారు డ్రైవర్ సంజుష్ వాహనాన్ని అధిక వేగంతో, నిర్లక్ష్యంగా నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ప్రమాదంలో భారతి ముఖి తలకు తీవ్ర రక్తస్రావ గాయమైంది. వెంటనే ఆమెను అదే కారులో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here