శేరిలింగంపల్లి, ఆగస్టు 18 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్‌రాంగూడ జనచైతన్య కాలనీలో నెలకొన్న సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై PAC చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రత్యేక దృష్టి సారించారు. కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి మంగళవారం ఆయన కాలనీలో పర్యటించి సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ.. జనచైతన్య కాలనీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే గాంధీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాలనీలో అసంపూర్తిగా ఉన్న రోడ్లు, డ్రైనేజీ, UGD పనులను పూర్తి చేయాలని, తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచాలని, అవసరమైన ప్రాంతాల్లో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

అనంతరం గాంధీ మాట్లాడుతూ.. కాలనీ వాసులు తన దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. దశలవారీగా అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని చెప్పారు. అసంపూర్తిగా ఉన్న రోడ్లు, UGD పనులను పూర్తి చేయడంతో పాటు UGD పైప్‌లైన్ నిర్మాణాన్ని చేపడతామని, ఔట్‌లెట్ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. జనచైతన్య కాలనీలో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తామని గాంధీ తెలిపారు. తాగునీటి వ్యవస్థను మెరుగుపరచడం, వీధి దీపాలు ఏర్పాటు చేయడం, పార్కులను అభివృద్ధి చేయడం వంటి పనులను చేపడతామని చెప్పారు. కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని, శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని గాంధీ పేర్కొన్నారు. ఏ చిన్న సమస్య ఎదురైనా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జలమండలి DGM శ్రీహరి, నాయకులు మంత్రిప్రగడ సత్యనారాయణ, ప్రభాకర్‌రెడ్డి, నాగరాజు, జనచైతన్య కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.





